మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

– గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి
– జిల్లా పాలనాధికారి అనురాగ్ జయంతి
నవతెలంగాణ – వేములవాడ
వచ్చే నెల మార్చి 7 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలో అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి జిల్లా కలెక్టర్ పర్యటించారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
శివరాత్రి లోగా శివార్చన స్టేజ్ సిద్ధం చేయాలి: మహాశివరాత్రి జాతర లోగా గుడిచెరువు ప్రాంగణంలో 90 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శివార్చన స్టేజ్ పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం తగదని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు శివార్చన స్టేజ్ ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గుడిచెరువు ప్రాంగణంలో భక్తుల కోసం షెడ్ లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆలయ అధికారులకు సూచించారు.
గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి: 12 కోట్ల రూపాయలతో చేపడుతున్న గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఎంతమేరకు పనులు పూర్తయ్యాయి అనే వివరాలను ఆరా తీశారు. సివిల్ పనులు పూర్తయ్యాయని, రెయిలింగ్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ల్యాండ్ స్కేపింగ్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అబ్బురపరిచేలా లైటింగ్ అమర్చాలని కలెక్టర్ సూచించారు.
గ్రంథాలయ భవనం నెల రోజుల్లోగా పూర్తి చేయాలి: వేములవాడ తహశీల్దార్ కార్యాలయ సమీపంలో పాఠకులు, పోటీ పరీక్షలు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం 1 కోటి 45 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిలో వేగం పెంచి, రాబోయే నెల రోజుల్లోగా గ్రంథాలయ భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
బీటీ రోడ్ విస్తరణ, డ్రైనేజీ, లేయర్ పనులు శివరాత్రి లోగా పూర్తి చేయాలి: వేములవాడ పట్టణంలో తెలంగాణ తల్లి చౌరస్తా నుండి కోరుట్ల బస్టాండ్ వరకు 600 మీటర్ల మేర 4 వరుసల రహదారి విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, రోడ్డుపై లేయర్ పనులను చేపట్టి మహాశివరాత్రి జాతర లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని సంబంధిత అధికారులు కలెక్టర్ కు వివరించారు. బీటీ రోడ్ విస్తరణ, రోడ్డుపై లేయర్ నిర్మాణ పనులను చేపట్టి నిర్దేశిత గడువు లోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, తహశీల్దార్ మహేష్ కుమార్, ఆలయ ఈఈ రాజేష్, పర్యాటక శాఖ ఏఈ జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Spread the love