కరిగిపోతున్న సహజ వనరులు.. చోద్యం చూస్తున్న అధికారులు

– మట్టి తరలిస్తూ కోట్లు గడిస్తున్న అక్రమార్కులు
– గుట్టలు గుల్ల చేస్తూ మట్టి తవ్వకాలు
నవతెలంగాణ – సిరిసిల్ల
పచ్చదనం పెంపొందించుకునేందుకు ప్రతి ఏటా హరితహారం పేరుతో గత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసింది కొండలు గుట్టలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కొంతమంది అక్రమార్కులు అధికారుల తీరుతో గత ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా గుట్టలను గుల్ల చేస్తూ సాగుతున్న మట్టి తవ్వకాలతో సహజ వనరులు కరిగిపోతున్నాయి రేయింబవళ్లు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్న వ్యాపారులు కోట్లు కొల్లగొడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న డంపు యార్డ్, చంద్రగిరి వద్ద అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ఈ వ్యవహారం జిల్లా ఉన్నత అధికారులకు తెలిసినప్పటికీ గత రాజకీయ నేతల హస్తం ఉండడంతో ఉన్నతాధికారులు అడ్డుకోవడానికి ముందడుగు వేయలేదు విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న అధికారులే ప్రేక్షక పాత్ర వహించారు రోజు వందలాది టిప్పర్లలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతుంది ఉన్నతాధికారులకు కొంతమంది మట్టి అక్రమ రవాణాతో గుట్టలు కరిగిపోతున్నాయని అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అడ్డుకోవడం కాకుండా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఫిర్యాదు చేసిన వారి పేరు మాత్రం అక్రమార్కులకు ఈ అధికారులు చెబుతున్నారు
బహిరంగంగా సాగుతుంది ఇలా..
కలెక్టరేట్ సమీపంలోని డంపింగ్ యార్డ్ చంద్రగిరి పరిధిలోని గుట్టల నుంచి మట్టిని బహిరంగంగా అక్రమ రవాణా చేస్తున్నారు ఎలాంటి అనుమతులు పొందకుండానే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి కొన్ని మాసాల నుంచి జిల్లాలోని పలు గుట్టలను అక్రమార్కులు తవ్వుకుంటున్నారు అయినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కావడం లేదు రాజకీయ అండదండలతో కొంతమంది బడా రాజకీయ నేతలతో పాటు గుత్తేదారులు ఈ గుట్టల తవ్వకాలకు పాల్పడుతుండడంతో అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు సాహసం చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి గుట్టల నుంచి మట్టి అక్రమ రవాణా జరుగుతున్నది తెలుసని అయినా రాజకీయ పెద్దల హస్తం ఉండడంతో తాము చేసేది ఏమీ లేక చూసి చూడనట్లు ఉంటున్నట్లు కొంతమంది అధికారులు చెబుతున్నారు ఇలా రాజకీయ నేతల కబంధహస్తాల్లో సిరిసిల్ల అక్రమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వ రాజకీయ నేతల మాటలు వినకపోతే బదిలీలు సస్పెండ్ చేయించడం ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేయించి పట్టించడం లాంటివి చేస్తారనే భయంతో కొంతమంది అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఈ రాజకీయ నేతల వల్ల ఇంతకు ముందు జరగడం వల్లనే ప్రస్తుతం అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో గుట్టలకు మట్టి తీసుకునే అనుమతి ఉన్నప్పటికీ అనుమతికి మించి మట్టిని తవ్వుకు పోతున్నారు అనేక మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని అధికారులు చెత్తబుట్టలో పడవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి
నిబంధనలు బెఖాతరు..
నిబంధనల ప్రకారం గుట్టలను లీజుకు తీసుకోవాలి మైనింగ్ శాఖా అధికారులు అనుమతి ఇచ్చేవరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. కానీ అలాంటిది ఏమీ లేకుండానే అక్రమార్కులు జోరుగా తవ్వకాలు జరుపుతూ ప్రతిరోజు వందలాది టిప్పర్లతో అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు ఈ ప్రభుత్వమైనా ప్రత్యేక దృష్టిసారించి రాజకీయ నేతలకు చెక్ పెడితేనే అధికారులు జిల్లాలో ఎలాంటి భయం లేకుండా పని చేసే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ పట్టుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గుత్తేదారులకు వరంగా మారింది ప్రధానంగా అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్ రెవెన్యూ శాఖలు చేతులు ముడుచుకునే ఉన్నాయని ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి.

Spread the love