పీఎంఓ పర్యవేక్షణలో ఎగ్జామ్!
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నిర్వహించే రీటెస్ట్‌లో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈసారి రీటెస్ట్ ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. పేపర్ తయారీ నుంచి ఫలితాల వరకు ప్రధాని కార్యాలయం నిశితంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ మీడియా వివరాల ప్రకారం… ఢిల్లీలోని తన నివాసంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ రీటెస్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ తయారు చేయడం, ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, పరీక్షా కేంద్రాలకు చేర్చడం వంటి ప్రతి ప్రక్రియను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) పర్యవేక్షించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నీట్ రీ టెస్ట్‌కు సంబంధించిన పరిణామాలను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను ఆయన తెలుసుకుంటున్నారని వివరించాయి. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను పేపర్ లీక్ అయ్యిందన్న కారణంతో మే 12న రద్దయిన విషయం విదితమే. అనంతరం జూన్ 21న రీ-టెస్ట్ పెడతామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. మే 3న దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,400కు పైగా కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాశారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ కారణంగా ఎగ్జామ్ రద్దవ్వడంతో వారు మరోసారి జూన్ 21న పరీక్షను రాయనున్నారు.కాగా నీట్ యూజీ అభ్యర్థుల పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాల సమర్పణ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన అంతరాయాల నేపథ్యంలో ఈ ఫీజు రీఫండ్ ప్రక్రియ నడుస్తోంది. వాస్తవానికి మే 27తో ముగియాల్సిన ఈ గడువును 2026 జూన్ 22 వరకు పొడిగిస్తూ ఎన్‌టీఏ ప్రకటించింది. అభ్యర్థులు నీట్ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించి, నేరుగా తమ ఖాతాల్లోకి ఫీజు రీఫండ్ పొందవచ్చు.
నీట్ రీటెస్ట్‌పై కేంద్రం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



