చండ్ర రాజేశ్వర్‌రావు చిరస్మరణీయుడు

– అమరుల ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు పునరంకితం కావాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
– సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఆర్‌ వర్ధంతి
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశవ్యాప్తంగా భూపోరాలకు శ్రీకారం చుట్టి నిరుపేద కుటుంబాలకు జీవనోపాది కల్పించిన చండ్ర రాజేశ్వరరావు చిరస్మరణీయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ అగ్రనాయకులు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వర్‌రావు 30వ వర్ధంతిని మంగళవారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగరిభవన్‌లో నిర్వహించారు. తొలుత సిఆర్‌ చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూనంనేని మాట్లాడారు. జమీందారి కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై తన యావదాస్తిని పేదలకు పంపిణీ చేసిన మహానీయుడు చండ్ర రాజేశ్వర రావు అని కొనియాడారు. పేదలకు భూమి దక్కితనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించిన సిఆర్‌ దేశవ్యాప్త భూపోరాటాలకు నాందిపలికాడన్నారు. పేద ప్రజల అభ్యున్నతికోసం అహర్నిశలు శ్రమించి అమరులైన నాటి నాయకులు చూపిన మార్గంలో పయనించి ప్రజా ఉద్యమాలకు నిర్మించడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్‌, జిల్లా సమితి సభ్యులు జి.వీరస్వామి, కె.రత్నకుమారి, నాయకులు మాతంగి లింగయ్య, మాటేటి గోపాల్‌, లక్ష్మి నారాయణ, గోపి, రాము, భూపేష్‌, హరీష్‌, భాగ్యలక్ష్మి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love