చెక్ డ్యాంతో పొలాలకు ప్రమాదం.?

– కరకట్ట కట్టని గుత్తేదారు
– ఆందోళనలో బాధిత రైతులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుత్తేదారుల జేబులు నింపడానికి మానేరు,వాగులపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ ల నిర్మాణాలతో రైతులకు లాభం దేవుడెరుగు కానీ వరద ముంపునకు గురై నష్టాలు మాత్రం జరుగుతున్న పరిస్థితి. ఫలితంగా గుత్తేదారుల జేబులు మాత్రం నిండాయి.ఇందుకు నిదర్శనమే మండలంలోని మల్లారం గ్రామంలో మానేరుపై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ ముంపునకు భారీగా వరద రావడంతో వందలాది ఎకరాల భూములు కోతకు గురైయ్యాయి. అలాగే  చిన్నతూండ్ల గ్రామంలో అరెవాగుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ వలన తమ భూములు కోతకు గురవుతున్నాయని రైతులు మిరియ్యాల రవీందర్రావు, మిర్యాల రవి, ఆవిర్నేని అచ్యుర్రావు, పులిగంటి బొందయ్య, పులిగంటి బాపు, జంగ చిన్నమల్లమ్మ, ధన్నపునేని రాజేశ్వర్రావులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. చెక్ డ్యామ్ నిర్మాణంతో లాభం కన్న భవిష్యత్ లో తమ పొలాలకు తీరని నష్టం జరుగుతుందని, చెక్ డ్యామ్ నిర్మాణం ఆపాలని అడ్డుకుంటే గుత్తేదారు రైతులకు ఇబ్బంది జరగకుండా కరకట్ట నిర్మాణం చేపడతానని మాయ మాటలు చెప్పి అసంపూర్తిగా చెక్ డ్యామ్ నిర్మాణం పూసి చేసినట్లు రైతులు ఆరోపించారు. చెక్ డ్యామ్ వల్ల గత ఏడాది ఉదృతమైన వరదతో పొలాల మీదగా వరద పోయి పొలాల్లో ఇసుక మేటలు వేశాయని దీంతో లక్షలు ఖర్చు చేసి భూములను సాగులోకి తీసుకొని వచ్చామని రైతులు తెలిపారు. నామమాత్రంగా మట్టి పోసిన తెలిపాటి వరదకు కొట్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో వర్షాలు కురిస్తే వరదలతో తమ భూములు కోతకు గురైయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. సంబంధించిన ఇరిగేషన్ అధికారులు,గుత్తేదారుకు  ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెట్టి ఏవరు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం,  జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కరకట్ట నిర్మాణం చేపట్టేలా చూడాలని బాధిత  రైతులు కోరుతున్నారు.
Spread the love