Thursday, August 6, 2026
E-PAPER
Homeక్రైమ్మూడు గంటల్లో 
చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన

మూడు గంటల్లో 
చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన

- Advertisement -


నవతెలంగాణ-బోడుప్పల్

​కండ్ల ముందే ఆడుకుంటున్న 8 నెలల చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు విలపిస్తూ.. క్షణమొక యుగంలా గడిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే.. వారు అత్యంత చాకచక్యంగా, అప్రమత్తతో వ్యవహరించి బాలున్ని గుర్తించి అప్పగించడంతో కన్నవారి ప్రాణం తిరిగొచ్చినట్టయింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగవంతమైన దర్యాప్తుతో ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ ‌బోడుప్పల్‌‌లో జరిగింది. ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ బిట్టు మోహన్ కుమార్, మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఎన్‌ఐఎన్ కాలనీలో నివసించే శివరామ్- స్పందన దంపతుల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్(8 నెలలు). బుధవారం మధ్యాహ్నం బయట అడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం, సాంకేతిక ఆధారాలన్నింటినీ పరిశీలిస్తూ చిన్నారి కోసం గాలింపు కొనసాగించారు. చివరకు అనుమానితురాలు కర్మన్‌‌ఘాట్‌‌కు చెందిన నల్లా దుర్గా భవానిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి చిన్నారిని రక్షించారు. వైద్య పరీక్షల అనంతరం బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.“మా బిడ్డ దొరుకుతాడో లేదో అనుకున్నాం.. కానీ మూడు గంటల్లోనే మా చేతుల్లో పెట్టారు” అంటూ తల్లిదండ్రులు భావోద్వేగంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
​బిడ్డను కోల్పోయి మానసిక వేదనతోనే కిడ్నాప్
చంటి బిడ్డను అపహరించిన మహిళను విచారించగా.. గతంలో తన బిడ్డను కోల్పోయిన నిందితురాలు అనేక రోజుల నుంచి మానసిక బాధను అనుభవిస్తున్నది. అదే సమయంలో భర్త ఒత్తిడి, మానసిక బాధ బాలుడికి కిడ్నాప్‌‌ చేసే పరిస్థితికి తీసుకొచ్చాయి. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐలకు, కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -