Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభలో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లు ఆమోదం

రాజ్యసభలో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లు ఆమోదం

- Advertisement -

లోక్‌స‌భ‌లో చ‌ర్చ లేకుండానే బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు పాస్‌
దేశవ్యాప్తంగా పెండింగ్‌ ‌కేసులు పరిష్కరించే దిశగా అడుగేయాలి : సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు 
జాన్‌ ‌బ్రిట్టాస్‌


‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​ జడ్జీల సంఖ్య పెంపు న్యాయానికి హామీ ఇస్తుందా? అని రాజ్య‌స‌భ ఎంపీలు ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే ఉభ‌య స‌భ‌ల్లో రెండు బిల్లుల‌ను ఆమోదించారు. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును ఆమోదించ‌గా, లోక్‌స‌భ‌లో ఎటువంటి చ‌ర్చ లేకుండానే బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లును ఆమోదించారు. రాజ్య‌స‌భ‌లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల సంఖ్య పెంపు బిల్లుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చ‌ర్చ‌కు పెట్టారు. హైకోర్టులు, ట్రయల్ కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీలు నొక్కి చెప్పారు. అంతేకాకుండా కేసుల పెండింగ్ సమస్యను లేవనెత్తుతూ, దేశవ్యాప్తంగా పౌరులందరికీ వేగవంతమైన న్యాయం అందేలా సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ స‌భ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు ఉండాల‌ని అన్నారు. న్యాయ‌మూర్తుల నియామ‌కంలో పార‌ద‌ర్శ‌క‌తతో కూడిన ప్ర‌క్రియ అవ‌స‌ర‌మ‌ని, ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడిందని తెలిపారు. కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటానికి కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే కారణం కాదని, ప్రభుత్వ నిర్ణయాలు, పిటిషన్లలో జరుగుతున్న ఆలస్యం కూడా ప్రధాన కారణమని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాల్లో మహిళలు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం న్యాయానికి హామీ ఇస్తుందా? అని జెఎంఎం ఎంపీ మ‌హువా మాంఝీ ప్రశ్నించారు. దేశ న్యాయ వ్యవస్థకు సమగ్ర ప్రక్షాళన అవసరమనీ, అది వ్యవస్థను నడిపే వ్యక్తులపైనా ఆధారపడి ఉంటుందని అన్నారు. కేసులు పెండింగ్‌లో ఉండటం, సుప్రీంకోర్టు సంగతి అటుంచితే జిల్లా కోర్టులు కూడా అందుబాటులో లేకపోవడం వంటి పలు కారణాలతో వేలాది మంది ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడంపై లేవ‌నెత్తారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ‘దక్షిణ భారత బెంచ్’ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర వద్దిరాజు ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు కేసులన్నింటికీ న్యూఢిల్లీకి రావడంలో పౌరులు ఎదుర్కొనే అదనపు ఇబ్బందులు, ఖర్చులను నివారించేందుకు సహాయపడే అటువంటి బెంచ్‌కు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. అనంత‌రం ప్ర‌తిప‌క్షాలు స‌భ‌ను వాకౌట్ చేశాయి. కేంద్ర మంత్రి స‌మాధానం అనంత‌రం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ​ లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళ‌నల మధ్య, డిజిటల్, వర్చువల్ రికార్డులను కోర్టులలో ఆమోదయోగ్యమైన సాక్ష్యంగా చేర్చే బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, సభలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. కేవ‌లం నిమిషాల్లోనే బిల్లును ఆమోదించున్నారు. ఈ బిల్లులో బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని రూపొందించడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా మార్చడం, అలాగే దానికి సంబంధించిన, అనుబంధమైన విషయాలు ఉన్నాయి. బిల్లు ఆమోదం అనంత‌రం స‌భ‌ను నేటికి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -