నవతెలంగాణ – ఆర్మూర్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. పట్టణ కేంద్రంలో బిక్నూర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల 2003–2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (గెట్ టుగెదర్) ఉత్సాహంగా నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న మిత్రులు చదువుకునే రోజుల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి మనస్తత్వంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు తమ జీవిత ప్రయాణంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు. ఒకరి కష్టాలను మరొకరు ఓదార్చుతూ, విజయాలను అభినందిస్తూ పరస్పరం ప్రోత్సహించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవితంలో గెలుపోటములు, మంచి చెడులు సహజమేనని, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలు కొంతవరకు దూరమై కొత్త ఉత్సాహం కలుగుతుందని అన్నారు. ఎంత బిజీ జీవితంలో ఉన్నప్పటికీ బాల్య స్నేహితులతో గడిపే సమయం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు.మిత్రుల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులోనూ అందరూ ఒకరికొకరు అండగా నిలుస్తూ స్నేహాన్ని కొనసాగించాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో బిక్నూర్ రెసిడెన్షియల్ కళాశాల 2003–2005 బ్యాచ్ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, శ్రీకాంత్, డాక్టర్ పీబీ. సత్యం, అనిల్, సురేష్, అశోక్, వినోద్, మధు, ప్రేమ్, సాయికుమార్, వెంకటేష్, రవికుమార్, రాంశేఖర్, సుకేష్, పవన్, విగ్నేష్, చంద్రశేఖర్, ప్రవీణ్, నవీన్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.



