చిన్నారుల బూచోళ్లు..

Children's boocholes..– 16మంది చిన్నారులను రక్షించిన మేడిపల్లి పోలీసులు
– కూపీ లాగితే కదిలిన డొంక
– పిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌
– ఢిల్లీ, పూణే, ముంబయి నగరాల నుంచి అక్రమ రవాణా
– తెలుగు రాష్ట్రాల్లో విక్రయాలు
– మూడేండ్లలో 50 మందికిపైగా విక్రయించినట్టు గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
శిశువు విక్రయాన్ని భగం చేసిన పోలీసులు.. ఆ ఘటన ద్వారా లోతైన దర్యాప్తు జరిపితే చిన్నారుల అక్రమ రవాణా అంతర్రాష్ట్ర ముఠా గుట్టు బయటపడింది. మొత్తం 16 మంది పిల్లలను రక్షించారు. ఢిల్లీ, పూణే, ముంబయి నగరాల నుంచి చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పీర్జాదీగూడలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి ఓ శిశువును రూ.4.50 లక్షలకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో కూపీ లాగితే డొంక కదిలింది. ఈ రాకెట్‌తో సంబంధమున్న ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు.
పీర్జాదీగూడలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా చెెలామణి అవుతున్న శోభారాణి, మేడిపల్లికి చెందిన హేమలత అలియాస్‌ స్వప్న, షేక్‌ సలీమాను పోలీసులు కొద్దిరోజుల కిందట అరెస్టు చేశారు. వారిని విచారిస్తే మరికొంత మంది పేర్లు వెలుగు చూశాయి. వీరిలో అనోజిగూడకు చెందిన బండారీ హరిహరా చెతన్‌, బండారీ పద్మ, విజయవాడకు చెందిన బాల్గం సరోజా, ముదావత్‌ శారద, ముదావత్‌ రాజు, పఠాన్‌ ముంతాజ్‌, జగన్నాథం అనురాధ, యాట మమత ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఈ ముఠా సంతానం లేని వారిని, కొత్తగా పెండ్లయిన వారితోపాటు పిల్లలు కావాల్సిన వారిని టార్గెట్‌ చేస్తుంది. వారికి కావాల్సిన చిన్నారులను ముందుగానే ఎంచుకుని ఢిల్లీ, పూణే, ముంబయికి చెందిన కిరణ్‌, ప్రీతి, కన్నయ్య నుంచి ఈ ముఠా కొనుగోలు చేసి రైళ్లు, కార్లు, విమానాల్లో తరలిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4 లక్షల నుంచి రూ.5.50లక్షల వరకు విక్రయిస్తున్నారు. మూడేండ్ల కాలంలో ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 50మందికిపైగా చిన్నారులను విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 16 మంది చిన్నారులను రక్షించి శిశుసంక్షేమ శాఖకు అప్పగించారు. అందులో 23 రోజుల పాపతో పాటు రెండు నెలల నుంచి రెండేండ్ల వయస్సు పిల్లలున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ముఠాకు సంబంధమున్న కిరణ్‌, ప్రీతి, కన్నయ్యతోపాటు మరికొంత మందిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. చట్టం ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవాలి కానీ.. అక్రమంగా చిన్నారులను కొనుగోలు చేసిన దంపతులు, ఇతరులు సైతం ఇబ్బందుల్లో పడతారని సీపీ తెలిపారు. చిన్నారులను కొనుగోలు చేసిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పివి.పద్మజా, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఎస్‌హెచ్‌వో ఆర్‌.కోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఏ.నర్సింగ రావు, ఎస్‌.అనిల్‌ కుమార్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love