సీఎంకు విద్యావేత్తలు, మేధావుల బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు, కవులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం ఈ మేరకు 125 మంది మాజీ న్యాయమూర్తులు, విద్యావేత్తలు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లేఖను విడుదల చేశారు. ఆరు నుంచి 14 సంవత్సరాలలోపు బాలలకు ఉచిత విద్య హక్కు అని తెలిపారు. సీఎం ప్రకటన అమల్లోకి వస్తే 8,769 గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు మూతపడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతానికి ప్రభుత్వ పాఠశాలలు సమీపంలో లేకుంటే దళిత, ఆదివాసీ, పేద వర్గాల పిల్లలు, ఆడపిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. బాల కార్మికుల సంఖ్య పెరుగుతుందనీ, మూసివేత నిర్ణయం ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని తప్పుపట్టారు. బడ్జెట్ లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసిన 6 వేల పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని మరిచి, 23 వేల పాఠశాలలను మూసేయాలనుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిలో 34 శాతం మంది మాత్రమే పిల్లలు మిగిలారనీ, 25 జిల్లాల్లో రెగ్యులర్ డీఈవోలు, 612 మండలాల్లో ఎంఈవోలు లేక విద్యా ప్రమాణాలు పూర్తి దిగజారిపోయాయని విమర్శించారు.
విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. ప్రభుత్వ బడుల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, సౌకర్యాలు కల్పించాలని, పోస్టులన్నింటిని భర్తీ చేయాలని, జీవో నెంబర్ 1ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, నాక్ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి, కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్, ప్రముఖ కవి రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ కె.చక్రధర్ రావు ప్రొఫెసర్ జి.హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మి నారాయణ, రాష్ట్ర సహాధ్యక్షులు వై.అశోక్ కుమార్, రాష్ట్ర సహ ప్రధాన కార్యదర్శి ఎం.రఘు శంకర్ రెడ్డి, డాక్టర్ వనమాల, ఫిలిం ప్రొడ్యూసర్ సయ్యద్ రఫీక్, , పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్, డీబీఎఫ్ జాతీయ అధ్యక్షులు శంకర్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.అనిల్ కుమార్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, పీడీఎస్ యూ విజృంభణ అధ్యక్షులు ఏ.విజయ్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


