Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యాటక అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి

పర్యాటక అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి

- Advertisement -

ఆ ప్రదేశాల అభివృద్ధి, ప్రమోషన్‌‌పై దృష్టి పెట్టాలి
 పెట్టుబడుల ఆకర్షణకు పీపీపీ, లీజ్ విధానాల ప్రతిపాదనలు
హెరిటేజ్ వాక్‌లు, ఉత్సవాలు, కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం
 హైదరాబాద్ కార్నివాల్ నిర్వహణపై అధ్యయనం చేయాలి : సమీక్ష‍లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల కల్పన, సమర్థ నిర్వహణతో పాటు విస్తృత ప్రచారం, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలు, కొత్తగా అభివృద్ధి చేసేందుకు అవకాశమున్న ప్రదేశాలను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పర్యాటకుల సంఖ్యను పెంచడంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్థిరమైన నమూనాలను రూపొందించాలని సూచించారు. పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్, మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రాంతాల నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, హెరిటేజ్ వాక్‌లు, ఉత్సవాలు, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కార్నివాల్ నిర్వహణ, తదితర అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇందులో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, పర్యాటక సలహా మండలి సభ్యులు పాపారావు, రాందేవ్ రావు, బాలాజీ, జుల్ఫికర్ తదితరులు పాల్గొన్నారు.

మూస పద్ధతులకు స్వస్తి పలికి వినూత్నమైన, ఆచరణ సాధ్యమైన, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించారు. కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న గమ్యస్థానాల బలోపేతం, వినూత్న పర్యాటక అనుభూతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి ద్వారా తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు, సూచనలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యాటక కార్యకలాపాల పర్యవేక్షణ, సమన్వయానికి సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పర్యాటక అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ మధ్య సమన్వయం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించాలన్నారు. అధికారులకు అవసరమైన అధికారాలను అప్పగించి, నిరంతర పర్యవేక్షణ, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో రోజువారీ నిర్వహణ అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు.

మరుగుదొడ్లు, తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, ఇతర సేవల నిర్వహణలో లోపాలకు తావులేకుండా చూడాలన్నారు హైదరాబాద్‌లోని చార్మినార్, కోఠి, పుత్లీబౌలి, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లో హెరిటేజ్, కల్చరల్ వాక్‌లను మరింత విస్తృతంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. పర్యటన ప్యాకేజీల రూపకల్పన, శిక్షణ పొందిన గైడ్‌ల ఏర్పాటు, పాతబస్తీ, కొత్త నగరంలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్టీసీ సహకారంతో షటిల్ బస్సు సర్వీసుల నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.​సోమశిలలోని దాదాపు 1,600 ఎకరాల భూమిని సమర్థంగా వినియోగించుకునేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కృష్ణా నది బ్యాక్‌వాటర్స్, అందుబాటులో ఉన్న భూములను పరిగణనలోకి తీసుకొని పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. స్టార్ హోటళ్లు, వెడ్డింగ్ డెస్టినేషన్లు, వాటర్ స్పోర్ట్స్, గోల్ఫ్ కోర్సు తదితర ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -