Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజలవనరుల ప్రయివేటీకరణను అడ్డుకోవాలి

జలవనరుల ప్రయివేటీకరణను అడ్డుకోవాలి

- Advertisement -

మత్స్యకారులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు పిలుపు
20న రాష్ట్రవ్యాప్త మత్స్యకారుల ఆందోళనలను జయప్రదం చేయాలి
తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ

​నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జలవనరులను ప్రయివేటీకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను మత్స్యకారులు ఐక్యంగా అడ్డుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు పిలుపు నిచ్చారు. తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్‌) రాష్ర్ట కార్యవర్గం, విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని మంచికంటి హాల్‌‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విస్తారమైన ప్రకృతి సహజ వనరులను చెరువులు, రిజర్వాయర్లు, ఇతర జలవనరులు ప్రజల ఆస్తిని అన్నారు. కానీ వాటిని ప్రయివేటు సంస్థలకు లేదా కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయని, దానివల్ల సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే పెను ప్రమాదాన్ని మత్స్యకారులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ఐక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఎంకేఎంకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 3 లక్షలు 24 వేల కోట్ల బడ్జెట్‌‌లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి కేవలం 17 కోట్ల రూపాయలు కేటాయించి మత్స్యకారులకు తీవ్రమైన అన్యాయం చేసిందని అన్నారు.

తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ర్టంలో మత్స్య సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప, రొయ్య పిల్లల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయడం సిగ్గుచేటని అన్నారు. ఉచిత చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం ప్రతి మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని మత్స్యకారులందరూ సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 12 సంవత్సరాలుగా మరణించిన 989 మంది మత్స్యకారులకు పరిహారం అందించాలని కోరారు. అర్హులైన మత్స్యకారులందరికీ బైకులు, మత్స్య మిత్ర రుణాలు ఇవ్వాలని, మత్స్యకారుల హక్కులను పరిరక్షించి, జలవనరులపై సంప్రదాయ మత్స్యకారులకే ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రయివేటీకరణ విధానాలను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో జులై 12 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, లక్ష కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ జులై 20న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిర్వహించే ఆందోళనలను మత్స్యకారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దీటి శ్రీనివాస్, పగడాల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు సింగం కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల అమరావతి బక్కి బాలమని, రాష్ట్ర కార్యదర్శులు గొడుగు వెంకట్ మునిగేల రమేష్ చిరుమళ్ళ బిక్షం తేలు ఇస్తారి మధుసూదన్ పిట్టల వెంకన్న చనమోని శంకర్, శీలం శీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -