మూడోసారి హుస్నాబాద్ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం కేసీఆర్

– సెంటిమెంటును ఫాలో అవుతున్న సీఎం
– 15న హుస్నాబాద్ లో సభ, 19న కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు
నవ తెలంగాణ – సిద్దిపేట :
తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. మూడోసారి ముచ్చటగా  తన సెంటిమెంటును ఫాలో అవుతూ ఎన్నికల కోసం మొదటి సభను 15న  హుస్నాబాద్ లో, నామినేషన్లను 19న ఉదయం నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గజ్వేల్,  కామారెడ్డిలలో నామినేషన్లను వేయనున్నారు కేసీఆర్. గతంలో కూడా రెండు పర్యాయాలు సాధారణ ఎన్నికల ముందు మొదటి బహిరంగ సభను హుస్నాబాద్ లోనే నిర్వహించారు. 1983 నుండి కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయంలో నామినేషన్లు వేసే ముందు ఆ నామినేషన్ పత్రాలను దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్లు వేస్తూ గెలుస్తూ వచ్చారు. అదే సెంటిమెంటును కూడా ఈ ఎన్నికలలో  కొనసాగించనున్నారు.
జిల్లాలో బహిరంగ సభలు..
 అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. 15న హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. 16న మధ్యాహ్నం ఒకటి గంట నుండి రెండు గంటల మధ్య జ‌న‌గామ‌ నియోజ‌క‌వ‌ర్గములో,  17న సిద్దిపేట‌ నియోజ‌క‌వ‌ర్గములో  మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల మధ్య  బహిరంగ సభలో పాల్గొననున్నారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గం లో పర్యటన తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఆనవాయితి కొనసాగింపు..
బీఆర్ఎస్‌ అభ్యర్థులతో అక్టోబర్ 15న తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యి, వారికీ బి-ఫార్మ్ ఇచ్చిన తర్వాత, హుస్నాబాద్ కి హెలికాప్టర్ లో వచ్చి తన 2023 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. 2014 ఏప్రిల్‌ లో, 2018 సెప్టెంబరు లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో  ప్రజల ఆశీర్వాద సభను సైతం ఇక్కడి నుంచి  బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సెంటిమెంట్లను ఆచరించడం వల్లనే ప్రభుత్వ ఏర్పాటు జరిగిందని, అందుకే ముఖ్యమంత్రి అవి కొనసాగిస్తున్నాడు అని బీఆర్ఎస్‌ నాయకులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఎన్నికల ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. పూజల అనంతరము నామినేషన్లు వేస్తూ, గెలుస్తూ వచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రచారం ప్రారంభించడం  ఎమ్మెల్యే వోడీతల సతీష్ కుమార్ కు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Spread the love