చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన..

నంతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
”సినిమా ఇండిస్టీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ, సామాజిక సమస్యలైన సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది. నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్‌ ధరలు పెంచాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ నియంత్రణకు కఅషి చేస్తూ ఒక వీడియో చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియో రూపొందించాలి. ఇది కచ్చితమైన షరతు. ఇండిస్టీలో ఎంత పెద్ద వాళ్లు వచ్చి రిక్వెస్ట్‌ చేసినా సరే, ఆ మూవీ తారగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియో విజువల్స్‌ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వండి. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం. డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వ నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. ఇదొక్కటే మా కండీషన్‌. సినిమా షఉటింగ్‌ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్‌శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తాం. మీడియా కూడా రాజకీయ వ్యవహారాలే కాకుండా డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేయాలని కోరుతున్నాం” అని సిఎం రేవంత్‌ రెడ్డి కోరారు.

Spread the love