27న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఈనెల 27 వ తేదీన వరంగల్- ఖమ్మం – నల్గొండ  పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ రోజున ఓటర్లు పూర్తి అవగాహనతో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జెండగే బుధవారం ఒక  ప్రకటనలో కోరారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్  స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలనీ,  ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2, లేదా 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో పేర్కొనాలనీ,  మొదటి ప్రాధాన్యత ఓటు కింద  1 వ అంకెను, ఒక అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయవలసి ఉంటుందనీ, ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1,2,3, వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలనారు. బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1  వ సంఖ్య ఇవ్వకూడదు. బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, అక్షరాలు రాయకూడదని, ఓటరు బ్యాలెట్ పేపర్ పై 1,2,3,4,5  సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని, ఓటరు  బ్యాలెట్ పేపర్ పై పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని  ప్రాధాన్యత రాయకూడదు. ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1,2  సంఖ్యలు వేయకూడదు. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో మాత్రమే 1,2,3, అంకెలు వేయాలి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు  వర్తించేలా నంబర్  మార్కు చేయకూడదనారు. విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎం.ఎల్.సి. ఎలక్షన్ లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.
Spread the love