అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

– మీ ఆరోగ్యం ఎలా ఉంది..
– సౌకర్యాలు ఎలా ఉన్నాయి..
– వృద్దుల ఆశ్రమం సందర్శనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– బద్దెనపల్లి అంగన్వాడి సెంటర్, వృద్ధాశ్రమం పరిశీలన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
”మీ ఆరోగ్యం ఎలా ఉంది.. సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. భోజన వసతి ఎలా ఉంది” అంటూ వృద్ధులను ఆరా తీశారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి లోని వృద్దుల ఆశ్రమాన్ని శుక్రవారం సందర్శించారు. ఆశ్రమంలోని వంటగది, స్టోర్ రూం, డైనింగ్ హాల్, ఆటలను ఆడుకునే గదిని పరిశీలించారు. అనంతరం వృద్ధులను ఆత్మీయoగా పలుకరించారు. వారి గదిలో కూర్చొని యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వృద్ధులను అడిగారు. వృద్దులు నడిచేందుకు ఉపాధి హామీలో (వాకింగ్ ట్రాక్ )మార్గం వేయాలని అధికారులకు సూచించారు. రోజూ ఏ ఏ కూరలు పెడుతున్నారు? ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా? అని వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూం లో అన్ని సరుకులు, ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలు పరిశీలించారు.
పిల్లల బరువు పరిశీలన..
బద్దెనపల్లి లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు హాజరు అయ్యారో రిజిస్టర్లో తనిఖీ చేశారు. విద్యార్థుల బరువును పరిశీలించారు. వంట గదిని పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ అంగన్వాడి లో 24 మంది హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ స్థానిక మండల పరిషత్ పాఠశాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఇక్కడ  జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love