పంచాయితీల సమరం.. ప్రశ్నార్థకం..!

– 10 రోజుల్లో ముగియనున్న సర్పంచ్ ల పదవీ కాలం
– ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం
–  ప్రత్యేక అధికారులా..! పర్సన్ ఇన్చార్జిలా..?
– పార్లమెంటు ఎన్నికలపై ‘స్థానిక’ప్రభావం
–  సకాలంలో నిర్వహించకపోవడంతో ‘ప్రత్యేక’ పాలన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాష్ట్రంలో ‘పంచాయతీ’ సమరం..ప్రశ్నార్థకంలో పడింది. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం మరో 12 రోజుల్లో ముగియనుంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘పంచాయతీ’ సమరంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇప్పట్లో ఎన్నికలను నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.మూడు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలపై స్థానిక ఎన్నికల ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదని కొత్త ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం మరో 10 రోజుల్లో ముగుస్తుండడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన, లేకుంటే పర్సన్ ఇన్చార్జీలుగా సర్పంచ్ లను నియమించాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.అయితే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు వాయిదా పడింది.జూన్ లో ఎన్నికలు నిర్వహించే  అవకాశాలున్నాయి. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు రెండు పర్యాయాల వరకు అప్పటి రిజర్వేషన్లు ఉంచినట్లయితే జూన్లో ఎన్నికలు సాధ్యమవుతాయి. ప్రభుత్వం రిజర్వేషన్లు ఒక పర్యాయానికే పరిమితం చేయాలని భావించినట్లయితే చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి శాసనసభ సమావేశాలు ఏర్పా టు చేసి చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఇంకా ఇదే సంవత్సరంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ ఏడాది మొత్తం ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు ధపాలుగా నిర్వహించారు. ఈసారి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దఫాలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
గత బీసీ రిజర్వేషన్ల వివరాలు..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు వివరాలను సేకరించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రస్థాయి అధికారులు 2006, 2013, 2018 సంవత్సరాల్లో గ్రామపంచాయతీల్లో అమలు చేసిన బీసీ రిజర్వేషన్ల వివరాలను తీసుకున్నారు. అప్పట్లో గ్రామపంచాయతీల్లో వార్డులు, సర్పంచ్లకు అమలైన బీసీ రిజర్వేషన్లను తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో పూర్తిస్థాయిలో కొత్తగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు ఉంటాయా?అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ పార్టీలు డైలమాలో ఉన్నాయి. సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నాయకులు కొత్త ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియకపోవడంతోపాటు రిజర్వేషన్లు పాతవే కొనసాగిస్తారా…?కొత్త రిజర్వేషన్లు చేసి ఎన్నికలు నిర్వహిస్తారని తేలకపోవడంతో నేతలు అయోమయంలో పడ్డారు.
ఎన్ని’కలేనా..! పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సర్పంచ్ గా పోటీ చేస్తామని కలలు కన్న అభ్యర్థుల ఆశలు ఎన్ని’కల’గా నే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టినందున పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగితే అలవోకగా సర్పంచ్లుగా ఎన్నికవొచ్చని కలలుగన్న అధికార పార్టీకి చెందిన నాయకుల ఆశలు.. అడియాశలు గానే ఉండిపోయాయి. మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక అభ్యర్ధిని బల పరిస్తే మరో అభ్యర్థి పార్టీకి దూరమయ్యే అవకాశానికి తావి స్తే ప్రభావం పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పడే అవకాశముందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది ష్టానం పార్లమెంటు ఎన్నికలు ముగిశాకనే పంచాయితీ ఎన్నికలను నిర్వహించడానికి మొగ్గు చూపుతుంది.
ప్రత్యేక అధికారులా.. పర్సన్ ఇన్చార్జిలా..? పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేనందున ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల పాలన ప్రత్యేక అధికారులు చేతికా.. పర్సన్ ఇన్చార్జీల చేతికి వెళ్తుందా అనేది ఇప్పుడు హాt టాపిక్ గా మారింది. జీవోనంబర్ 113 ప్రకారం గ్రామ పంచాయ తీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుంటే ప్రత్యేక అధికా రులను గాని, లేదా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ లనే పర్సన్ ఇన్చార్జీలుగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉంది. ప్రత్యేక అధికారులను నియమిస్తేనే పంచాయతీల్లో పాలన సాఫీగా సాగే అవకాశ ముంద ని పలువురు అభిప్రాయపడుతున్నారు.జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్లను పర్సన్ ఇన్చార్జీలు గా నియమించేందుకు రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత చూపకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగేవరకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో 2005లో సర్పంచ్ పదవీకాలం పూర్తయిన వెంటనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాటు సర్పంచ్ నే పర్సన్ ఇన్చార్జీలుగా నియమించింది. తదనం తరం 2011లో సర్పంచ్ పదవీకాలం ముగియ గానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011నుంచి 2013 వరకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ప్రత్యేక అధికారుల పాలనకు కసరత్తు..! పాలకవర్గాల పదవీకా లం 10 రోజుల్లో ముగియనున్నందున.. ప్రతీ గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారిని నియమిం చేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు ఇప్పటినుంచే పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేక అధికా రులుగా ఎంపీడీవోతోపాటు, తహసీల్దార్, ఎంపీవో, ఆర్ఐలు, సర్వేయర్లు, ఎంఈవోలు, ఈజీఎస్,ఐకేపీ సిబ్బం దిని ఎంపిక చేసే పనిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నట్టు సమాచారం.

Spread the love