నకిలీ విత్తనాలు విక్రయిస్తే  కఠిన చర్యలు తీసుకుంటాము: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే తెలిపారు. సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ హాలులో ఆయన డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్రతో కలిసి  జిల్లాలోని విత్తన డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీలర్లతో మాట్లాడుతూ.. విత్తన డీలర్లు రాబోయే వానకాలం సీజన్ సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన వితనాలు అమ్మాలని, రైతులు నష్టపోకుండా, నకిలీ విత్తనాల బారిన పడకుండా డీలర్లు సహకరించాలని, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని, ఎంఆర్పి రేట్లకంటే ఎక్కువ అమ్మకూడదని, లేబుల్ లేకుండా అమ్మకూడదని సూచించారు. అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు మార్కెట్లలోనికి రాకుండా నివారించేందుకు నాలుగు మండలాలకు ఒకటి చొప్పున 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి టీములో ఒక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇద్దరు పోలీసు అధికారులు ఉంటారని, ఎరువులు, విత్తన దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తారని, లైసెన్సు లేకుండా విత్తనాలు అమ్మినా, మధ్య దళారులు విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. హెచ్.టి.కాటన్ (కలుపు మందును తట్టుకునే ఒక రకం) విత్తనాలకు మన దేశంలో అనుమతి లేదని, అమ్మితే పి.డి. యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అలాగే లూజ్ విత్తనాలు, ఎక్స్పైరీ దాటిన విత్తనాలు అమ్మినా చర్యలు ఉంటాయని తెలిపారు.
డీలర్లు తమ షాపులలో రిజిష్టర్లు, బిల్స్ సరిగా నిర్వహించాలని, నిఘా బృందాలకు చూపించాలని,  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు అమ్మాలని, ఇ -పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరుగాలని సూచించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నకిలీ విత్తనాల పట్ల కలిగే నష్టాలపై, మేలు రకం  బ్రాండెడ్ విత్తనాల ద్వారా వచ్చే లాభాలను వివరించాలని, వ్యవసాయ అధికారులు జర్మినేషన్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి  నాణ్యతా పరీక్షల కోసం విత్తన షాంపుల్స్ హైదరాబాదు రాజేంద్రనగర్ విత్తన పరీక్షా కేంద్రానికి పంపాలని సూచించారు. అనంతరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ..  డీలర్లందరూ వ్యవసాయ, పోలీస్ శాఖలకు సహకరించాలని,  రైతులకు మేలు చేయాలని అన్నారు. ముఖ్యంగా చట్టం గురించి అందరూ తెలుసుకోవాలని, విత్తనాలు అక్రమంగా స్టోర్ చేసినా, రవాణా చేసినా, లూజుగా అమ్మినా జరిమానాతో పాటు శిక్షకు కూడా గురికావాల్సి వస్తుందని, ప్రతి ఏడాది రాచకొండ పరిధిలో రైతులను మోసం చేస్తున్న వారిపై పి.డి. యాక్ట్ ద్వారా శిక్షించడం జరిగిందని, నకిలీ విత్తనాలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. ఎవరైనా రైతులను మోసం చేస్తున్న విషయం తెలిస్తే పోలీస్ శాఖకు టోల్ ఫ్రీ ద్వారా తెలుపాలని, తద్వారా రైతులకు మేలు చేసిన వారవుతారని డీలర్లను కోరారు.  సీడ్ సరిగా లేక రైతులకు పంట దిగుబడి సరిగా రాకపోతే కూడా పంట పరిశీలించి అమ్మిన వారిపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని, డీలర్లు అందరూ  ప్రభుత్వం సూచించిన బ్రాండెడ్ విత్తనాలని అమ్మాలని, రైతు క్షేమం కోసం అందరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని నేషనల్ హైవేలపై నకిలీ విత్తన రవాణా జరుగకుండా నిఘా పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,  వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దేవీసింగ్, పద్మావతి,  వెంకటేశ్వర్లు,  నీలిమ,  జిల్లా విత్తన డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు బజ్జురి రవి, వ్యవసాయ అధికారులు  పాల్గొన్నారు.
Spread the love