మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ

– బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి 
 నవతెలంగాణ -కమ్మర్ పల్లి 
చెరువుల పునరుజ్జీవన పథకం మిషన్ కాకతీయ కాదని కమీషన్ కాకతీయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి విమర్శించారు. గురువారం మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలోని నాగులపాటికుంట చెరువున సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ప్రతి చెరువుకు అలుగు వరద కాలువ నిర్మాణాలు చేశారన్నారు. ఆ వరద కాలువ నిర్మాణలను సాంకేతికంగా కాకుండా ఇష్టారీతినా నిర్మాణం చేయడంవలన చెరువులోని వరద నీరు అలుగు ద్వారా కాకుండా పంటపొలాల్లోకి వెళ్లి సుమారు గ్రామంలోని 20 ఎకరాలలో పంటలు నీటిపాలయ్యాయన్నారు. చెరువుకు ఆనుకొని కట్టాల్సిన అలుగు కాలువకు మధ్యలో రోడ్డు వేసి ఆ రోడ్డును ఎత్తులో నిర్మించడం వలన గత మూడు సంవత్సరాలుగా చెరువులోని నీరు పంటపొలాల్లోకి వెళ్లి తీవ్ర పంట నష్టం జరుగుతుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా స్థానిక రైతులు, గ్రామస్తులు కమ్మర్ పల్లి తహసిల్దార్ ను కలిసి సమస్యను విన్నవించుకున్న వారి గోడును పట్టించుకునే నాథుడేలేడన్నారు. చెరువుల పునరుజ్జీవన పథకం మిషన్ కాకతీయ కాదు కమీషన్ కాకతీయ అని విమర్శించారు. ఈ పథకం ద్వారా కేవలం మంత్రి ప్రశాంత్ రెడ్డి, కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడ్డారని ఆరోపించారు. రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసే అభివృద్ధి  రైతులు లాభపడేలా ఉండాలే కానీ  నష్టపోయేల ఉండొద్దని హితవుపలికారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా చెరువుకు మరమ్మత్తులు చేసి రైతుల పంట పొలాలు కాపాడాలన్నారు. లేనిపక్షంలో తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కుంట భూమారెడ్డి, ఎగుర్ల రవి, జక్కుల మల్లికార్జున్, పర్శ మల్లయ్య, మానాల రాజు, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love