ప్రత్యర్థులపెనేౖ ఐటీ, ఈడీ

ప్రత్యర్థులపెనేౖ ఐటీ, ఈడీ– కాంగ్రెస్‌ అభ్యర్థులే లక్ష్యంగా దాడులు
– కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు
– లబ్ది పొందేందుకు బీజేపీ పొలిటికల్‌ గేమ్‌
– చీకటి పొత్తులను గమనిస్తున్న ఓటర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నుంచి మొదలుకుని గడ్డం వివేక్‌ల వరకు వరుస పెట్టి కాగ్రెస్‌ పార్టీ అభ్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పుడు మొదలైన ఈ దాడుల పరంపర ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మరింత ఎక్కువయ్యాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఎన్నికల క్షేత్రాన్ని ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ దాడులకు వేదికగా మార్చిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థులను వేధించేందుకు బిజెపి ఉపయోగించుకుంటున్న తీరు ఎన్నికల్లో ఆ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌ కు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దక్షిణాదిలో ప్రాబల్యం పెంచుకోవాలి లేదంటే కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళుతోంది. నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయం తామేనని నమ్మపలికిన పార్టీ నేడు అస్త్ర సన్యాసం చేసి ఆ పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అందులో బాగంగానే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులపై ఐటీ, ఈడీ దాడులకు తెరలేపింది. ఆర్ధిక మూలాలను దెబ్బ తీయడడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచాలని దాడులకు శ్రీకారం చుట్టిందని విమర్శలు ఉన్నాయి. నవంబర్‌ 2న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, టికెట్‌ ఆశించి భంగపడ్డ పారిజాత నర్సింహరెడ్డి, పాలేరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్‌ అభ్యర్థి జయవీర్‌ రెడ్డిలపై వరుసగా ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. నిన్నటి వరకు బీజేపీలో ఉండి కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు నియోజక వర్గం నుంచి ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన వివేక్‌ వెంకట స్వామితో పాటు ఆయన సోదరుడు బెల్లంపల్లి అభ్యర్థి వినోద్‌లపై తాజాగా ఐటీ, ఈడీ దాడులు జరిగాయి.. సోదాల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, ఆ పార్టీ మద్దతు దారులను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఓటర్లు గమనిస్తున్నారని ఆ రెండు పార్టీలకు రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పదని హస్తం శ్రేణులు అంటున్నాయి. లిక్కర్‌ కేసులో ముద్దాయిగా ఉన్న కవితను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఇదే కేసులో ఉన్న ఆప్‌ నాయకులు జైల్లో మగ్గుతున్నారు. ఐటీ ఈడీ లకు కవిత ఎందుకు కనిపించదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. తెలంగాణ ఎన్నికల్లో కాగ్రెస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకు పెరుగుతుండడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాగ్రెస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ మైనార్టీల ఓటు బ్యాంక్‌ను చెక్కుచెదర కుండా ఉంచేందుకు గత వారం రోజులుగా ఆ పార్టీపై రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు జాతీయ నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. బీఆర్‌ఎస్‌ తమ వైరి పక్షం అని నమ్మించేందుకు ఈ పంథాను ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. అదే సందర్భంలో బీఆర్‌ఆర్‌ వ్యతిరేక ఓటును గంప గుత్తగా కాంగ్రెస్‌కు బదిలీ కాకుండా ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని భుజాన ఎత్తుకుంది. తెలంగాణలో ఎట్టి పరిస్టితుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టకూడదనే పట్టుదలతో బీజేపీ కొత్త పొలిటికల్‌ గేమ్‌కు తెరలేపింది. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా సాగుతున్న ఇరు పార్టీల తీరు వల్ల ఎన్నికల్లో నష్టం తప్ప లాభం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

Spread the love