సమగ్ర రక్షణ సహకారం

Comprehensive Defense Cooperation– ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌, శ్రీలంక సంతకాలు
– ప్రధాని మోడీకి మిత్ర విభూషణ అవార్డు ప్రదానం
కొలంబో : మొట్టమొదటిసారిగా, భారత్‌, శ్రీలంక బృహత్తరమైన రక్షణ సహకార ఒప్పందంపై శనివారం సంతకాలు చేశాయి. మరింత సమగ్రమైన రీతిలో ద్వైపాక్షిక సహకారానికి చేపట్టాల్సిన విస్తృత ప్రణాళికను ప్రధాని మోడీ వివరించారు. ఇరు దేశాలు పరస్పరం ఆధారపడి వున్నాయని, వాటి భద్రత కూడా ముడిపడి వుందని మోడీ పేర్కొన్నారు. ఇరు పక్షాలు ఏడు కీలకమైన ఒప్పందాలపై సంతకాలు చేయగా వాటిలో రక్షణ ఒప్పందం ఒకటి. అంతకుముందు ప్రధాని మోడీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె విస్తృతాంశాలపై చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడానికి ప్రధానమైన చర్యగా ఈ రక్షణ సహకార ఒప్పందాన్ని భావిస్తున్నారు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళం కార్యకలాపాల తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ”మా భద్రతా ప్రయోజనాలు దాదాపు ఒకటేనని మేం విశ్వసిస్తున్నాం. ఇరు దేశాల భద్రత పరస్పరం ముడిపడి వుంది, ఆధారపడి వుంది.” అని ప్రధాని మోడీ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రయోజనాల గురించి అధ్యక్షుడు దిసనాయకె ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. రక్షణ సహకారంతో సహా పలు ముఖ్యమైన ఒప్పందాలను స్వాగతిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు భంగకరమైన రీతిలో తమ భూభాగాన్ని ఉపయోగించేందుకు శ్రీలంక అనుమతించబోదని దిసనాయకె, మోడీకి హామీ ఇచ్చారు. కీలకమైన సమయాల్లో భారత్‌ అందించిన సాయానికి, కొనసాగిస్తున్న సంఘీభావానికి తామెంతగానో రుణపడి వున్నామని పేర్కొన్నారు. ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధిపరచడానికి మరో కీలకమైన ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. దేశ ఇంధన భద్రతకు సాయపడే సంపూర్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ఇరువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. పొరుగుదేశాలకు ప్రాధాన్యతనివ్వాలనే భారత్‌ విధానంలో శ్రీలంకకు ఎప్పుడూ ప్రత్యేక స్థానముందని మోడీ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీకి మిత్ర విభూషణ అవార్డు ప్రదానం
ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమివ్వడంలో ప్రధాని మోడీ చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకె, మోడీకి మిత్ర విభూషణ అవార్డును ప్రదానం చేశారు. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు మహీందా రాజపక్సా ఏర్పాటు చేశారు. ఇది తనకే కాదని, 140కోట్ల మంది భారతీయులకు అందిన గౌరవమని మోడీ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయనకు సాదర స్వాగతం లభించింది.

Spread the love