విద్యార్థి దశ నుండి చివరి వరకు ప్రజా ఉద్యమాల్లో కొనసాగిన కామ్రేడ్ గద్దర్

నవతెలంగాణ – హైదరాబాద్
భూస్వామ్య పెత్తందారి దోపిడీపై తన పాటలతో గళ మెత్తిన గద్దర్ మరణం ప్రజా పోరాటాలకు తీరని లోటు అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం. జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆర్. వెంటక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. ఆంజనేయులు అన్నారు. విద్యార్థి దశ నుండి తుది వరకు ప్రజా పోరాటాలతో ప్రజా యుద్ధనౌక గద్దర్ జీవితం మమేకమై నది. ఆయన మరణం ప్రజా పోరాటాలకు తీరని లోటు అని బి వెంకట్ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు ఆయనకు ఘనమైన నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ తన పాటలు కళారూపాల ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంత పేదలను భూస్వాములు పెత్తందార్ల దోపిడికి వ్యతిరేకంగా సమీకరించారు అని అన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య ఇంజనీరింగ్ చదివి అతివాద ఉద్యమాలవైపు వెళ్లారు. చివరివరకు ప్రజా ఉద్యమాల్లో కొనసాగారు. చివరి రోజుల్లో వ్యవసాయ కార్మిక, సామాజిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీ-మాస్, తెలంగాణ అభివృద్ధి కోసం కొనసాగిన మహాజన పాదయాత్ర, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సాధన కోసం సాగిన ఉద్యమం, పేదలు ఇండ్ల స్థలాల కోసం చేసిన పోరాటాలకు సంఘీభావంగా నిలబడ్డారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటల హత్యలకు వ్యతిరేకంగా, ప్రజా ఉద్యమకారులపై నిర్బంధానికి వ్యతిరేకంగా, ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ ను కొనసాగించాలని సాగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు.

Spread the love