– సింగరేణికి సీహెచ్సీ అందని ద్రాక్ష
– పడకేసిన పల్లె దావాఖానాలు
– 108 లేని కారేపల్లి పీహెచ్సీ
– పోరాటాలతోనే 50 పడకల ఆస్పత్రి
– సీపీఐ(ఎం) నేత భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-కారేపల్లి
పాలకులు మారుతున్న ఏజెన్సీలో వైద్యానికి అవస్ధలు తప్పటం లేదు. జిల్లాలో 140 గ్రామాలతో విస్తరించిన పెద్ద మండలం సింగరేణి. గిరిజన జనాభా అత్యధికంగా కలిగిన ఈ మండలంలో కారేపల్లిలో ప్రాథమిక వైద్యశాల తప్ప మరోకటి లేక పేదలు అవస్ధలు పడుతున్నారు. పేదలకు సున్తి చేస్తే ఉన్న ఆరోగ్యకేంద్రానికి వెళ్ళితే జ్వరం, దగ్గు బిళ్ళలు తప్ప పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదు. 80వేల జనాభా కల్గి ఒక పీహెచ్సీ మాత్రమే ఉంది. దానికి సైతం 108 లేకపోవటం చూస్తే ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. రోగం వస్తే జిల్లా కేంద్రాసుప్పత్రికి వెళ్లటానికి దూరభారం కావటంతో గత్యంతరం లేక ప్రాణాలు దక్కించుకోవటానికి పల్లె వైద్యులు, ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఇల్లు ఒల్లు గుల్ల చేసుకునే పరిస్ధితి ఉంది. మండల కేంద్రానికి సుదూర గిరిజన పల్లెలైనా చీమలపాడు, బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి, గేటురేలకాయలపల్లి, పాటిమీదిగుంపు గ్రామపంచాయతీల ప్రజలు వైద్యం కోసం సతమవుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ఖమ్మం లేదా ఇల్లందు కొత్తగూడెం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి. చిన్నపిల్లల, బాలింతలు, గర్భవతులు నానా యాతనపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి లేని వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి. 80 వేల జనాభా కల్గిన మండలానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవసరం ఉంది. 50 పడకల ఆస్పత్రి, 108 సౌకర్యం కావాలని ప్రజాసంఘాలు పోరాటాలు చేసి, ప్రజాప్రతినిధులకు వివరిస్తే నేతల హామీలకే తప్ప అమలుకు నోచుకోవటం లేదు.
పడకేసిన పల్లె దావాఖానాలు
ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలోనే మందులు కరువైతే ఇక పల్లె దావఖానాల పరిస్ధితి చెప్పనవసరం లేదు. పేరుకే దావఖానాలు తప్ప వసతులు లేవు, స్ట్రేచర్లుండవు, సూదు మందులు నిల్వకు శీతల యంత్రాలుండవు. కూర్చునే కూర్చీలు లేక దాతల సాయంను పల్లెదావఖానాల సిబ్బంది ఆర్ధిస్తున్నారు. మండలంలో 16 ఆరోగ్య ఉపకేంద్రాలుండగా వాటిలో 13 కేంద్రాలను పల్లెదావఖానాలుగా గత ప్రభుత్వం ఆఫ్ గ్రేడ్ చేసింది. ప్రతి పల్లె దావఖానాలో ఒక వైద్యుడు స్టాఫ్ నర్స్, ఇద్దరు ఏఎన్ఎంలు పని చేయాల్సి ఉంది. తర్వాత వైద్యుల స్ధానంలో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) నిమిస్తున్నారు. కారేపల్లి మండలంలోని పల్లె దావఖానాలో ముగ్గురు డాక్టర్ మాత్రమే ఉండగా మిగతా వాటిలో ఎంఎల్హెెచ్పీలతో నడిపిస్తున్నారు. పల్లెదావఖానాలకు అరకొర మందులు మాత్రమే సరఫరా జరుగుతుంది. వాటిలోనే క్షేత్రస్ధాయి సిబ్బంది గ్రామాల్లో పంపిణి చేయాల్సి ఉండటంతో రోగులకు ఒకొటి రెండు గోళీలు మాత్రమే ఇచ్చి సరిపుచ్చుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పల్లెదావాఖానాలకు మందుల కొరతతో సిబ్బంది సర్వేలు, సమీక్షలకే పరిమితమవుతున్నారు.
పోరాటాలతోనే 50 పడకల ఆసుపత్రి
-గిరిజన సంఘం నేత భూక్యా వీరభద్రం
ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాల్సిన పాలకులు బాధ్యత మరచి వ్యవహరిస్తురని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో 140 గ్రామాలతో జనాభా, విస్తీర్ణం పరంగా పెద్దమండలమైన సింగరేణిపై చిన్న చూపే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లా, వైరా గిరిజన నియోజకవర్గం పరిధిలో సింగరేణి మండల ప్రజల వైద్యకరువును తీర్చాలన్నారు. పెద్దమండలం గిరిజనులు అధికంగా ఉన్న సింగరేణి మండలం50 పడకల ఆసుపత్రి సాధించటం ఐక్య పోరాటాలతోనే సాధ్యమన్నారు. సీహెచ్సీ సాధనకు ప్రతిఒక్కరు సంసిద్దులు కావాలని ప్రజలను కోరారు.
మందుల కొరత లేకుండా చూస్తున్నాం
-డాక్టర్ బీ.సురేష్
పీహెచ్సీ, పల్లె దావాఖానాలలో మందుల కొరత లేకుండా చూస్తున్నాం. పై నుండి సరఫరా జాప్యం కారణంగా కొన్ని మందులు లేవు. తర్వాత వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కు ప్రపోజల్స్ పంపించారు. సీజనల్ వ్యాధుల కాలం కావటంతో వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము.