కాంగ్రెస్లో కలకలం

– అభ్యర్థులు ఖరారు అంటూ సోషల్ మీడియాలో వైరల్
– దామోదర్ రెడ్డి-రమేష్ రెడ్డి ల మధ్య పెరుగుతున్న దూరం
– ఢిల్లీలో ఉత్తమ్ నివాసంలో దామన్న
– కోమటిరెడ్డి ఇంట్లో పటేల్
– ఆలస్యం కానున్న జాబితా
నవ తెలంగాణ-సూర్యాపేట:
 కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కలకలం రేపుతుంది. ఇంకా జాబితా, పొత్తులు ఫైనల్ కాకపోయినప్పటికీ 62 మందితో జాబితా అంటూ పలు పత్రికల్లో,సోషల్ మీడియాలో రావడం దుమారం రేపుతోంది. అభ్యర్థుల పేర్లతో జాబితా వైరల్ అవుతుండడంతో ఉమ్మడి జిల్లాలో హల్ చల్ నెలకొంది. ఇదిగాక జాబితాను పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ చేస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ టికెట్లను ప్రకటించి ఎన్నికల యుద్ధ రణరంగానికి సిద్ధపడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం వడపోతలు, పొత్తులు, కమిటీల భేటీలు చర్చలతో కాలయాపన చేస్తూ నాయకుల, కార్యకర్తల సహనాన్ని  పరీక్షిస్తుంది. ఈ క్రమంలోనే గత రెండు, మూడు రోజుల నుంచి పత్రికలు, సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న జాబితా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రధానంగా  సూర్యాపేట టిక్కెట్ విషయంలో మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ వర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోంది. ఢిల్లీలో ఇంకా టిక్కెట్ల కేటాయింపు ఫైనల్ కాకపోయినా తమ నాయకుడి కె టిక్కెట్ వచ్చిoదంటూ కార్యకర్తలు సోషల్ మీడియాలలో పోస్టింగ్ లు పెడుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న సూర్యాపేట టికెట్ ను దామోదర్ రెడ్డి కి కేటాయించినట్లు గా జాబితా లో పెరు ఉండటం.. దీంతో పాటు కార్యకర్తలు టిక్కెట్ ఒకే అయిందంటూ హల్చల్ చేస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉండగా రమేష్ రెడ్డి కె టిక్కెట్ కేటాయిస్తూ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇదిగాక పట్టణంలో బాణసంచా కాల్చి సందడి చేశారు. సర్వేల ఆధారంతో పాటు రేవంత్ రెడ్డి కోటాలో టికెట్ తనదే అనే పూర్తి భరోసాతో రమేష్ రెడ్డి ఉన్నారు. కాగా సీనియార్టీ ప్రకారం దామోదర్ రెడ్డి కె టికెట్ వస్తుందని ఆయన అభిమానులు నియోజకవర్గంలో వైరల్ చేస్తున్నారు. ఈ రకంగా నియోజకవర్గంలో ఇరువర్గాల వాదోపవాదాలతో పాటు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ దుమారం రేపుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సూచన మేరకు రాహుల్ గాంధీ సూర్యాపేట టికెట్ను రమేష్ రెడ్డి కి కేటాయించినట్లు గా మరోమారు సోషల్ మీడియాలో  వైరల్ అయినది.ఇది అవాస్తవమని టిక్కెట్ల కేటాయింపు జరగలేదని దసరా పండుగ తర్వాత టిక్కెట్ల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి ల మధ్య టికెట్ పోరు నడుస్తుంది. ఈ క్రమంలో పత్రికలో వచ్చిన జాబితాతో పాటు సోషల్ మీడియాలో వేర్వేరుగా వచ్చిన  జాబితాలతో  కార్యకర్తలలో అయోమయం నెలకొంది. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో పత్రికలలో సోషల్ మీడియాలో జాబితా వైరల్ అయిన సందర్భంలో ఆనాడు టిపిసిసి అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి ఫేక్ జాబితాని  ఖండించిన విషయం విధితమే. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతున్న జాబితాపై టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిల్లీలో  స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేవరకు 119 నియోజకవర్గాలలో 6 గ్యారంటీలే మా అభ్యర్థులని ఎలాoటి వదంతులు నమ్మవద్దని కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా టిక్కెట్ కోసం దామన్న, రమేష్ రెడ్డి లు ఢిల్లీలో మకాం వేశారు. ఇందులో భాగంగా దామోదర్ రెడ్డి నల్గొండ యంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ఉండగా.. రమేష్ రెడ్డి భువనగిరి యంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఉంటూ తమ తమ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇక రమేష్ రెడ్డి మంగళవారం సూర్యాపేటకు బయలు దేరగా దామన్న బుధవారం లేక గురువారం హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అగ్ర నేతల బస్సు యాత్రలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగ తర్వాత జాబితా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Spread the love