కాంగ్రెస్.. బీజేపీ తమ గ్రాఫ్ ను కోల్పోయాయి

– రాష్ర్టంలో 35 మెడికల్ కాలేజీలు నిర్మించాం
– ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం
– కేసిఆర్ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో తమ గ్రాఫ్ ను కోల్పోయాయి కానీ తమ అంగ బలం, అర్థ బలంతో ఊహజనతమైన, గోబెల్ ప్రచారాలను చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను నడుపుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం హుస్నాబాద్ బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీలమని చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోయని, ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చేస్తామని వస్తున్న ఆయా పార్టీలు వారు పాలించే రాష్ట్రాలలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ చేసి చూపించి మన దగ్గరికి వచ్చి చెప్పాలన్నారు. సాధించిన తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధికి గట్టి పునాది వేశారని అన్నారు. కేసిఆర్ పాలనలో రాష్ట్రం ఎలాంటి అలజడి లేకుండా సుభిక్షంగా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాటలు, కల్లోలిత పరిస్థితులు ఉండేవని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు రాజకీయ వైరుధ్యం లేదు, స్నేహపూర్వక వాతావరణం ఉండేదని అన్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులు ఉండాలి కానీ శత్రుత్వం ఉండవద్దని రాజకీయాలను ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలని కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆలోచించాలని హితవు పలికారు. గులాబీ పార్టీ క్రమశిక్షణ కలిగిన నైతిక విలువలు కలిగిన నాయకులు కార్యకర్తలను కలిగి ఉందని ప్రజాసేవే బీఆర్‌ఎస్‌ కి పరమావధి అని అన్నారు.తెలంగాణ తెస్తామన్నాం తెచ్చి చూపించామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కట్టాం, సంక్షేమ పథకాలలో దేశానికి ఆదర్శంగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 35 మెడికల్ కాలేజీలు నిర్మించామని, ప్రతి సంవత్సరం పదివేల మంది డాక్టర్లను సమాజానికి అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని స్వయంగా నీతి అయోగ్ అభినందిస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందని కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ గెలవడం ఖాయమని వినోద్ కుమార్ ఘంటాపథంగా తెలియజేశారు.
Spread the love