కాంగ్రెస్‌వి 420 హామీలు

కాంగ్రెస్‌వి 420 హామీలు– 60 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదు
– 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెడతాం
– ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మైనంపల్లి
– కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా
– అయినా నోరుమెదపని సీఎం రేవంత్‌రెడ్డి
– ‘మల్కాజిగిరి’లో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే : ఉప్పల్‌, మల్కాజిగిరి విజయోత్సవ సభల్లో కేటీఆర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా
అసెంబ్లీ ఎన్నికల సమయలో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులైనా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు.
100 రోజుల్లో ఈ హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెడతామని హెచ్చరించారు. ఆదివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించిన ఉప్పల్‌, మల్కాజిగిరి విజయోత్సవ సభల్లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఉప్పల్‌లో జోష్‌ చూస్తుంటే, అధికారంలో బీఆర్‌ఎస్‌ ఉందా.. కాంగ్రెస్‌ ఉందా.. అర్థం కావడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘మల్కాజిగిరి’లో బీఆర్‌ఎస్‌దే గెలుపని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మడతబెట్టి కొట్టుడే అని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను చూసి జిల్లాల్లోని ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్‌ చేతల ప్రభుత్వం కాదు, కేవలం మాటల ప్రభుత్వమే అని తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నారని చెప్పారు. సీఎం హోదాలో ఉండి చిన్నా, పెద్దా తేడా లేకుండా కేసీఆర్‌ పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన లాగా తాము కూడా మాట్లాడగలమని, తిట్టగలమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ మంచికే వచ్చాయి అనుకుంటున్నట్టు చెప్పారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా చూపించినా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకోలేక తమ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి అన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసానిచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ను అధిష్టానం ఎవ్వరికి కేటాయించినా అందరూ కలిసి కట్టుగా పని చేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ నందికంటి శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, ఉప్పల్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డిజిజన్‌ అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love