మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ పాగా!

kmm muncipl– రాష్ట్రంలో 36 మున్సిపాల్టీల్లో నోటీసులు.. ఇప్పటికే నాలుగు హస్తగతం
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు బీఆర్‌ఎస్‌ చేతిలోనే..!
– ఖమ్మం కార్పొరేషన్‌ సహా అన్నింటిపైనా కన్ను
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు కాంగ్రెస్‌ చేపట్టడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్న పలు జెడ్పీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు, సహకార సంఘాల్లో వీలైనన్నింటినీ ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సాధారణంగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికార పార్టీలోకి చేరేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతారు. ఏ చిన్న అవకాశం దొరికినా అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయింపులకు దిగుతారు. ఆకర్షిస్తే ఏ మున్సిపాల్టీ అయినా ‘హస్త’గతమయ్యే చాన్స్‌ ఉంది. దీన్ని కాంగ్రెస్‌ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలో 36 మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఆర్మూర్‌, నల్లగొండ, మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాల్టీలు ఇప్పటికే హస్తగతమయ్యాయి. మరికొన్ని కాంగ్రెస్‌ ఖాతాలోకి రానున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. అధికార పార్టీ వైపే చాలామంది మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు సహా ఖమ్మం నగరపాలక సంస్థలో అవిశ్వాసానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న వైరా మున్సిపాల్టీ మినహాయిస్తే సత్తుపల్లి, మధిర మున్సిపాల్టీల్లో అవిశ్వాసానికి ఆకర్ష్‌ మంత్రం ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తగూడెంలో స్థానికంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తుండటం.. కాంగ్రెస్‌కు ఇక్కడ ఒకే ఒక్క కౌన్సిలర్‌ ఉన్న నేపథ్యంలో ఈ మున్సిపాల్టీ మినహా ఉమ్మడి జిల్లాలో మిగతా చోట్ల పాగా వేసేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.
చర్చనీయాంశంగా ఇల్లెందు అ’విశ్వాసం’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఇల్లెందులో అవిశ్వాసంపై చర్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పొసగని మున్సిపల్‌ చైర్మెన్‌ డి.వెంకటేశ్వరరావు సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చైర్మెన్‌తో కలిపి కాంగ్రెస్‌ కౌన్సిలర్ల సంఖ్య ఐదుకు చేరింది. మున్సిపాల్టీల్లో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా నాలుగేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 19, కాంగ్రెస్‌ రెబల్‌ 3, సీపీఐ 1, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నుంచి ఒక్కరు గెలిచారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి కోరం కనకయ్య ఎన్నికయ్యారు. ఇప్పటికే చైర్మెన్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయన స్థానంలో మరొకరిని ఎన్నిక చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. సరిగ్గా రెండ్రోజుల కిందట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ప్రియాంకా అలకు సభ్యులు లేఖ ఇచ్చారు. దీనిలో బీఆర్‌ఎస్‌కు చెందిన 17 మంది, సీపీఐ, న్యూడెమో క్రసీ సభ్యులు ఇద్దరు మొత్తం 19 మంది సభ్యులు సంతకాలు చేశారు. చైర్మెన్‌గా ఖమ్మానికి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గణేశ్‌ భార్య సరిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అవిశ్వాసానికి ఆమోదం లభిస్తే ఇల్లెందు చైర్మెన్‌ పీఠం తిరిగి బీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి అవిశ్వాసానికి అనుకూల సంకేతాలు రాకపోవచ్చనే చర్చ సాగుతోంది. కాబట్టి కాంగ్రెస్‌ చేతిలోనే మున్సిపాల్టీ ఉండే అవకాశం ఉంది.

ఉప ముఖ్యమంత్రి ఉన్నా మధిర సాధ్యమేనా..?
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాల్టీ సైతం బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉంది. ఇక్కడ కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే పెద్దఎత్తున ఆకర్షణకు ప్లాన్‌ చేయాలి. ఈ మున్సిపాల్టీల్లో 22 వార్డులకుగాను బీఆర్‌ఎస్‌కు 15 మంది, కాంగ్రెస్‌ ఇద్దరు, టీడీపీ ముగ్గురు, సీపీఐ(ఎం), స్వంత్రులు ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో స్వతంత్ర కౌన్సిలర్‌ మాధురి గతంలోనే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఓ వార్డు కౌన్సిలర్‌ కొద్దిరోజుల కిందట మృతిచెందారు. మొత్తంగా బీఆర్‌ఎస్‌ బలం 13కు తగ్గింది. టీడీపీ ముగ్గుర్ని కలుపుకున్నా కాంగ్రెస్‌ బలం ఏడుగురికి చేరుతుంది. అవిశ్వాసం పెట్టాలంటే ఆపరేషన్‌ ఆకర్ష్‌ తప్పదని కాంగ్రెస్‌ నేతల్లో చర్చ జరుగుతున్నది.

ఒక్క కౌన్సిలర్‌ లేని సత్తుపల్లి ‘హస్త’గతమయ్యేనా..?
సత్తుపల్లి మున్సిపాల్టీలో 23 వార్డులుండగా అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. వీరిలో ఎన్నికలకు ముందు వైస్‌ చైర్మెన్‌ తోట సుజలారాణి సహా ఐదుగురు కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి మట్టా రాగమయి గెలిచారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కౌన్సిలర్లను కాంగ్రెస్‌ వైపు ఆకర్షిస్తే ఇక్కడ అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం
ఉంది.
కాంగ్రెస్‌లోనే వైరా చైర్మెన్‌.. అవిశ్వాసం లేనట్టే..!
ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాల్టీలున్నాయి. దీనిలో వైరా కాంగ్రెస్‌ చేతిలోనే ఉంది. సత్తుపల్లి, మధిరను బీఆర్‌ఎస్‌ నుంచి లాక్కునే యత్నాలు సాగుతున్నాయి. వైరా మున్సిపల్‌ చైర్మెన్‌ సూతగాని జైపాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్పట్లోనే అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 16 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు ఇద్దరు, సీపీఐ(ఎం), స్వతంత్రులు ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు. ఎన్నికల సమయంలో పలువురు పార్టీ మారడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలం సమమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, వైరా ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి రాందాస్‌ నాయక్‌ ఎన్నికైన దృష్ట్యా చైర్మెన్‌గా కాంగ్రెస్‌కు చెందిన జైపాలే కొనసాగే అవకాశం ఉంది.

ఖమ్మం కార్పొరేషన్‌పై కన్ను..
ఖమ్మం కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ కన్నేసింది. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌కే అత్యధిక కార్పొరేటర్లు ఉన్నా ఎన్నికల సమయంలో 8 మంది ఆ పార్టీని వీడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా నెగ్గడంతో ఆ తర్వాత చాలా మంది కార్పొరేటర్లు ఆయనతో టచ్‌లోకి వెళ్లారు. మేయర్‌ పునుకొల్లు నీరజతో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. కనీసం మరో పది మంది కార్పొరేటర్లైనా కాంగ్రెస్‌లో చేరాకే అవిశ్వాసం వైపు మొగ్గు చూపాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Spread the love