మేడిగడ్డ మరమ్మతులు చేతగాదు సీఎం రేవంత్‌రెడ్డి,
మంత్రులవి మాటలే తప్ప..చేతలు శూన్యం
గతంలోనే అగ్రిమెంట్ అయితే..మళ్లీ మహారాష్ట్రను ఒప్పించడమెందుకు?
సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేట
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిందన్నారు. రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడితో.. వాళ్లకు పని తక్కువ ప్రచారం ఎక్కువగా.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని అర్థమవుతోందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఒప్పందమే అయితే… ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదని ప్రశ్నించారు. ఆరోజు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారని.. ‘మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారు.. మీరు ఏ పని చేసినా వృథా అవుతుంది’ అని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే, తుమ్మిడిహెట్టి దగ్గర పనులు ప్రారంభించకుండా.. తోక పనులను ఎందుకు ప్రారంభించారు? చేవెళ్ల దగ్గర ఎందుకు తవ్వారని ఆయన ప్రశ్నించారు.
కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ”తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ల బ్యారేజ్‌కి నీళ్లు తెస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అంటారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఏమో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్టుతో నీళ్లు తెస్తామంటారు. మంత్రి జూపల్లి లిఫ్ట్ అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయి అంటారు. ఎవరు చెప్పేది నిజం?” అని ఆయన ప్రశ్నించారు. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్రను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒప్పించాలని మొన్న సీఎం అంటారు.. కానీ, గతంలోనే అగ్రిమెంట్ జరిగిందని మంత్రి వివేక్ అంటున్నారు కదా, అగ్రిమెంట్ జరిగి ఉంటే మళ్లీ మహారాష్ట్రను ఒప్పించడం ఎందుకు అని ప్రశ్నించారు. ”తుమ్మిడిహెట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు రావాలి. ఈ సాధకబాధకాలు తీర్చకుండా.. డైలాగులు కొట్టడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు” అని హరీశ్‌రావు అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2024-25 బడ్జెట్లో రూ.2 కోట్లు, 2025లో రూ.30 కోట్లు, ఈ ఏడాది రూ.50 కోట్లు, మొత్తం రూ.82 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీలో మూడు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్లను కట్టకుండా సమయం వృథా చేశారని ఆయన ఆరోపించారు. కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.2300 కోట్లు బిల్లులు లేపారని, కరప్షన్ అనేది కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనులకు, ల్యాండ్ అక్విజిషన్‌కు ఖర్చు చేసింది రూ.3780 కోట్లు, కానీ సీఎం రేవంత్ రెడ్డి రూ.11 వేల కోట్లు పూర్తయ్యాయని పచ్చి అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. ఈ మండు టెండల్లోనూ మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీళ్లు కిందకి వెళ్లిపోతున్నాయని, తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే పోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తుమ్మిడిహెట్టి జలహారతుల డ్రామాలు కట్టిపెట్టి, వెంటనే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.



