Monday, April 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్న్యాయాన్ని బ‌తికించిన కానిస్టేబుల్ రేవ‌తి

న్యాయాన్ని బ‌తికించిన కానిస్టేబుల్ రేవ‌తి

- Advertisement -

ఆ పోలీస్‌ స్టేషన్‌ మొత్తంలో ఆమే ఏకైక మహిళా కానిస్టేబుల్‌. పైగా జూనియర్‌. సీఐ నుండి మిగతా అందరూ మగ పోలీసులే. వాళ్లదే ఆధిప్యతం. వాళ్లు ఏం చెబితే అదే చేయాలి. అలాంటి పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఓ దారుణమైన సంఘటన. ఇద్దరు అమాయకులు హత్యకు గురయ్యారు. ఆ సంఘటనకు సాక్షం ఆ లేడీ కానిస్టేబుల్‌. కేసు విచారణకు వచ్చినపుడు సాక్షం చెబితే చంపేస్తామని బెదిరించారు. ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించారు. అయినా ఆమె న్యాయం వైపే నిలబడింది. ఆ తొమ్మిది మంది పోలీస్‌ అధికారులకు శిక్ష పడేలా చేసింది. అందుకే డేరింగ్‌ లేడీ కానిస్టేబుల్‌గా ప్రపంచం ముందు నిలబడింది. ఆమే కానిస్టేబుల్‌ రేవతి.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాంతకుళం పోలీస్‌ స్టేషన్‌లో 2020లో కోవిడ్‌ నింబంధనలను ఉల్లంఘించి తమ తమ మొబైల్‌ షాపును తెరిచినందుకు తండ్రీ కొడుకులైన జయరాజ్‌, బిన్నిక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారి లాకప్‌ డెత్‌ కేసు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఐదేండ్ల సుదీర్ఘవిరామం తర్వాత ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనక ఉన్న రియల్‌ హీరో ఒక సాధారణ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌. తోటి అధికారుల కిరాతకాన్ని కండ్లకు కట్టినట్టు బయట పెట్టేందుకు ప్రాణాలకు తెగించించింది. ఆమె ఇచ్చిన సాక్షం ఇప్పుడు ఇద్దరు అమాయకుల మరణానికి న్యాయం జరిగేలా చేసింది. అంతేకాదు పోలీస్‌ వ్యవస్థలోని మరో కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

దృఢంగా నిలబడ్డారు
ఆ సమయంలో రేవతి అదే పోలీస్‌ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్నారు. ఆ కేసులో అప్రూవర్‌గా మారిన ఆమె, తన భద్రతకు, కుటుంబానికి, ఉద్యోగానికి ఎలాంటి హామీ లేకపోయినప్పటికీ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన సంఘటనలను మేజిస్ట్రేట్‌కు వివరించారు. ఆ కేసులో నిందితులైన అధికారులు సీనియర్లు, పలుకుబడి ఉన్నవారు. కానీ రేవతి మాత్రం ఒక జూనియర్‌ కానిస్టేబుల్‌. అయినా అమాయకుల కోసం ఆమె దృఢంగా నిలబడ్డారు. అందుకే ఆమె ధైర్యానికి దేశమంతా నేడు సెల్యూట్‌ చెబుతోంది. కేసు విచారణకు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.ఎస్‌. భారతిదాసన్‌ వచ్చినప్పుడు, ఆమె ఆయనతో, ”సార్‌, నేను మీకు ప్రతిదీ, ప్రతి వివరం, దాస్తున్న నిజాన్నీ చెబుతాను. కానీ నేను ఇద్దరు ఆడపిల్లల తల్లిని. పిల్లలు పసివాళ్లు. మీరు నా పిల్లల భద్రతకు, నా ఉద్యోగానికి హామీ ఇవ్వగలరా?’ అని ఆమె అడిగారు.

ఆగ్రహం పెల్లుబికింది
ఆ రాత్రి జరిగిన దారుణాన్ని, అమాయకులైన తండ్రీ కొడుకులను పోలీసు అధికారులు నిర్దాక్షిణ్యంగా ఎలా కొట్టారో, వారు తీవ్ర గాయాలపాలయ్యారో, ఆ తర్వాత వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి ఎలా రిమాండ్‌ చేశారో ఆమె నిమిష నిమిషానికి వివరించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఇద్దరూ మరణించడంతో ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన సిబ్బందిని రేవతి నిర్భయంగా గుర్తించారు. తద్వారా నేర బాధ్యతను నిర్ధారించడంలో కీలకమైన, సంఘటనా స్థలంలో వారి ఉనికిని నిరూపించడంలో సహాయపడ్డారు.

అత్యంత క్రూరంగా…
ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అధికారులు మద్యం తాగడానికి మాత్రమే విరామం తీసుకుని, తమకు దొరికిన వాటితో బాధితులపై దాడి చేశారు, వారి మర్మాంగాలపై బూట్లతో తొక్కారు. ‘నేను రాత్రి 8.50 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు చేరుకున్నాను. ఆ సమయంలో లోపలి నుండి ఎవరో ‘అమ్మా, నొప్పిగా ఉంది! నన్ను వదిలేయండి! దయచేసి నన్ను వదిలేయండి! నేను చేసింది నిజంగా తప్పు!’ అని అరుస్తూ, ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఈ శబ్దాల మధ్యలో, స్టేషన్‌ ప్రాంగణంలోకి ప్రవేశించిన సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణన్‌, ‘స్టేషన్‌లో గొడవ చేయడానికి నీకెంత ధైర్యం? నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా?’ అని అరుస్తున్న స్వరం అస్పష్టంగా వినిపించింది’ అని ఆమె మేజిస్ట్రేట్‌కు రేవతి చెప్పారు. ‘నేను అక్కడికి చేరుకునేసరికి, వారు ఆ వ్యక్తిని దారుణంగా కొడుతున్నారు. అతని శరీరం రక్తంతో తడిసిపోతోంది… కొంతసేపటి తర్వాత నేలపై పడిన రక్తాన్ని గాయపడిన వ్యక్తితోనే ఇన్‌స్పెక్టర్‌ శుభ్రం చేయించాడు’ అంటూ ఆమె జోడించారు.

వారి బట్టలు విప్పి…
హింసను భరించలేక పడిపోయిన ఆ ఇద్దరూ కొంత స్పృహలోకి వచ్చినప్పుడు రేవతి, జయరాజ్‌ను ఏమైనా కావాలా అని అడిగి కాఫీ ఇచ్చింది. కానీ అధికారులు దానిని వెంటనే పక్కకు నెట్టేశారు. ఒకానొక సమయంలో వారి బట్టలు విప్పి, చేతులు కట్టేశారు. ఆ క్రూరత్వాన్ని చూడలేక ఆమె గది నుండి బయటకు వెళ్లిపోయారు. మౌనంగా ఉండమని తోటి అధికారులు హెచ్చరించి నప్పటికీ, సంఘటన జరిగిన సమయంలో సుమారు 37 ఏండ్ల వయసులో ఉన్న రేవతి మాట్లాడటానికి సిద్ధపడింది. సహోద్యోగులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అరుదైన పోలీస్‌ వ్యవస్థలో ఇది ఒక అసాధారణమైన చర్య.

హైకోర్టు ఆదేశాల మేరకు
కేసు ప్రారంభ దశలో రేవతి వాంగ్మూలానికి మద్దతు లభించినప్పటికీ ఆమె ఆందోళనతోనే ఉన్నారు. 2020లో ‘ది న్యూస్‌ మినిట్‌’తో మాట్లాడుతూ, తన వాంగ్మూలంలోని వివరాలు బహిరంగం కావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఉన్నతాధికారుల వేధింపులకు గురికావడం నాకు అస్సలు ఇష్టం లేదు’ అని ఆమె అన్నారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా యంత్రాంగం ఆమెకు, ఆమె భర్తకు భద్రత కల్పించేందుకు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను నియమించి రక్షణ కల్పించింది. 2020లో జరిగిన ఒక విచారణ సందర్భంగా, మద్రాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆమెకు ఫోన్‌ చేసి, విచారణ సమయంలో కొన్ని నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడి, ఆమె భద్రతకు హామీ ఇచ్చింది.

తీవ్రమైన బెదిరింపులు
ఈ సమయంలో రేవతి ఎన్నో విధాలుగా బెదిరింపులు ఎదుర్కొంది. అక్కడి వాతావరణం ఎంత ఉద్రిక్తంగా ఉందంటే, ఆమె తన వాంగ్మూలాన్ని నమోదు చేయగలదని నిర్ధారించుకోవడానికి మేజిస్ట్రేట్‌ విచారణ గది బయట ఒక కాపలాదారుని ఉంచవలసి వచ్చింది. అయినప్పటికీ, పోలీసు సిబ్బంది స్టేషన్‌ బయట గుమిగూడి విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించారు. బెదిరింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, రేవతి మొదట్లో తన వాంగ్మూలంపై సంతకం చేయడానికి సంకోచించారు. రక్షణ కల్పిస్తామని పదేపదే హామీలు ఇచ్చిన తర్వాతే ఆమె చివరికి సంతకం చేశారు.

– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -