నియోజకవర్గమే నా కుటుంబం ప్రజలే నా కుటుంబ సభ్యులు.. దనసరి అనసూయ(సీతక్క)

– వీరవనితలు సమ్మక్క సారలమ్మ  సాక్షిగా పోరాడతాను
– ఓడించాలని అధికార పార్టీ కుట్రలు పన్నుతోంది

నవతెలంగాణ-ములుగు: ములుగు నియోజకవర్గమే నా కుటుంబము ప్రజలే నా కుటుంబ సభ్యులు అని కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో భారీ జన సందోహం వెంట రాగా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ లో మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడారు. గడిచిన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని అన్నారు. కరోణ సమయంలో నా నియోజకవర్గ ప్రజలకు ఏ లోటు లేకుండా సమస్యలు రాకుండా ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ గళం ఎత్తి మాట్లాడడం జరిగిందన్నారు. ప్రతి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలను నిరంతరం కలుస్తూ  సమస్యలను వాటి తీవ్రతను ఇబ్బందులను దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేశారని అన్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది అన్నారు. అలాంటి నన్ను ఓడించడానికి వందల కోట్లతో వలస నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. స్థానికంగా బలం లేకపోవడంతో పొరుగు నియోజక వర్గాల నుండి  బడా బడా నాయకులను దిగుమతి చేసుకొని నా ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. వారి కుట్రలకు కోట్లకు బెదరను అని ప్రజాబలం ముందు అవన్నీ బలాదూర్ అని అన్నారు. ప్రజల ఆశీస్సులు సహకారం ఉన్నంతకాలం ఏ శక్తులు నన్ను అడ్డుకోలేవని ఓడించలేవని అన్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని  సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ల ను  తలదన్నే విధంగా ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మరోసారి మీ బిడ్డగా ఆడబిడ్డగా ఇంటి తోబుట్టువుగా ఆదరించి , ఆశీర్వదించి గతంలో కంటే అధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుండి వలస వచ్చి రాజకీయాలు చేస్తున్న వారికి కనువిప్పు కలిగేలా గుణపాఠం చెప్పాలని ప్రజలను ఓటర్లను కోరుతున్నానని అన్నారు.

Spread the love