కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి…

Contract faculty Do regular...– నేటి నుంచి విధుల బహిష్కరణ, నిరవధిక సమ్మె : తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్‌ జేఏసీ
నవతెలంగాణ-కేయూ క్యాంపస్‌
యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని నేటి నుంచి విధుల బహిష్కరణ, నిరవధిక సమ్మెకు ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఆదివారం యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులతో కేయూలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్‌ జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌ లోథ్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1445మంది కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. 143 రోజుల నుంచి విశ్వవిద్యాలయాల్లో అనేక విధాలుగా సదస్సులు, రౌండ్‌ టేబుల్‌, రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. గతంలో అనేకసార్లు యూనివర్సిటీ అధికారులను, ప్రభుత్వ అధికారులను, విద్యాశాఖ మంత్రిని, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ను కూడా కలిసినట్టు చెప్పారు. అయినా నేటి వరకు సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నేటి నుంచి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అందరూ తమ విధుల్ని బహిష్కరించి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారని తెలిపారు. డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ఏ విధంగా అయితే రెగ్యులరైజ్‌ చేశారో అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. నిరవధిక సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ మధుకర్‌రావు, డాక్టర్‌ జరుపుల చందులాల్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ సంగీత్‌ కుమార్‌, డాక్టర్‌ జి.రమేష్‌, డాక్టర్‌ రఘు వర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love