Thursday, April 30, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం.. 

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం.. 

- Advertisement -

– రైతుల ఆందోళనతో ఉద్రిక్తత
– వైస్ ఛైర్పర్సన్ జూపల్లి జోక్యంతో కొలిక్కి వచ్చిన సమస్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం తరుగు విషయంలో వివాదం చెలరేగి రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులు కేంద్రంలో 5 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, అదనంగా ముఠా కూలీ కూడా చెల్లించాల్సి వస్తోందని ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వాదన ప్రకారం, 5 కేజీల తరుగు కారణంగా ఎకరానికి సుమారు రూ.5 వేల వరకు నష్టం వాటిల్లుతోందని, ఇది పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే నిబంధనల పేరిట అనవసరంగా కోతలు విధించడం, అదనపు ఖర్చులు మోపడం వల్ల తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సహకార పరపతి సంఘం ఇన్‌చార్జి సీఈవో రాజశేఖర్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ “ప్రభుత్వ నిబంధనలు నచ్చకపోతే మీ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోండి” అని వ్యాఖ్యానించడంతో రైతుల్లో మరింత ఆగ్రహం చెలరేగింది. అధికారుల తీరుపై ఆగ్రహించిన రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. తూర్పార పట్టిన వడ్లకు 5 కేజీల తరుగు విధించడం రైతులకు నష్టం కలిగిస్తోందని, గతంలో అమలు చేసినట్లుగా 3 కేజీల వరకు మాత్రమే తరుగు తీసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

ఈ సందర్భంగా జూపల్లి రమేష్ మాట్లాడుతూ చిన్న చిన్న పరిపాలనా లోపాల వల్ల ప్రభుత్వంపై అనవసర విమర్శలు వస్తాయని, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారికి అండగా నిలవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి ప్రమోద్, పసుపులేటి రామస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -