– ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ :సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక సదస్సులు
నవతెలంగాణ-మహబూబాబాద్/విలేకరులు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక ఐక్యతా సదస్సులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలోని సీఐటీయూ కార్యాలయంలో కార్మిక, కర్షక ఐక్యత సదస్సు ఆకుల రాజు, ఎం.రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10ఏండ్లుగా కార్మికులు, రైతులు, శ్రామికులు, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్లకు దాసోహంగా పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడంతోపాటు ఉద్యోగాలివ్వకుండా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామికుల నిజ వేతనాలు 20శాతం పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చి కార్మిక హక్కుల్ని కాలరాస్తోందన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలపై పెనుభారం పడిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటలకు పెంచడం, పీఎఫ్, ఈఎస్‌ఐచ కనీస వేతనాలు లేకుండా చేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక, కర్షకులు ఐక్యమై పోరాటానికి సన్నద్ధం అవుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 16న జరిగే సమ్మెలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కాసు మాధవి, జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నల్లపు సుధాకర్ పాల్గొన్నారు.
ప్రజల జీవనోపాధిపై దాడులు
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిర్వహించే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు.
దేశం కోసం శ్రమిస్తున్న కార్మిక, రైతుల జీవితాలు, జీవనోపాధిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా అనాగరిక దాడులు చేస్తోందని కార్మిక ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కండ్లు తెరిపించేందుకు కార్మికులు, రైతులు కలిసి ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ప్రసంగించారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్మిక కర్షక ఐక్యతా సదస్సు నిర్వహించారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేసి, కార్మిక కర్షక ఐక్యత చాటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామన్నారు.