అవకాశవాద పార్టీలను మట్టి కరిపించాలి : సీపీఐ(ఎం)

– ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ప్రమీల
నవతెలంగాణ-నకిరేకల్ : అవకాశవాద పార్టీల కాకుండా ప్రశ్నించే గొంతు అయినా సీపీఐ(ఎం) కు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల కోరారు. శనివారం నకిరేకల్ పట్టణంలో వివిధ వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీపీఐ(ఎం) తోనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. బూర్జువా పార్టీలకు సీపీఐ(ఎం) ముళ్లకర్ర లాంటిదన్నారు. అవకాశ వాద పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసింది సీపీఐ(ఎం) పార్టీ మాత్రమే అన్నారు. డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఏం చేసుకోలో అర్థం కాకుండా ఓట్లు కొనుగోలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకోవాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలను గెలిపించకూడదన్నారు. కమ్యూనిస్టుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్యపెట్టి కొత్త కొత్త హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి సంపదను పెట్టుబడిదారులకు చౌక ధరల్లో కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచే సీపీఐ(ఎం) అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సీపీఐ(ఎం) పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చట్టసభలో ప్రజల గొంతునై వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, రాచకొండ వెంకట్ గౌడ్, నాయకులు వంటిపాక వెంకటేశ్వర్లు, మారయ్య బహు రోజు ఇందిరా, ఒంటెపాక కృష్ణ, లకపాక రాజు, బి. రాం బ్రహ్మచారి, జానమ్మ, మంగమ్మ, దేవకమ్మ, లతా పాల్గొన్నారు.
Spread the love