ఇండ్ల స్థలాల నిర్మాణాన్ని ఆపితే, తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: సీపీఎం

నవతెలంగాణ –  జమ్మికుంట
మండలంలోని సైదాబాద్ గ్రామంలో సర్వేనెంబర్ 234 లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి తహసీల్దార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి , సర్పంచ్, అందరి సమక్షంలో పంపిణీ చేసిన స్థలాలను హద్దులు కూడా చూపించి, మళ్లీ ఇప్పుడు  అధికారుల ఆదేశాలు వచ్చేంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, కేసులు పెడదామని  బెదిరించడం ఎంతవరకు సమంజసం అని సీపీఎం జోనల్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎలక్షన్ల ముందు, ఎన్నికల లబ్ధి కోసమేనా, స్వయంగా ఉండి పట్టాలు అప్పటి ఎమ్మెల్సీ, ఇప్పటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారన్నారు. ఇప్పుడు ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటే స్పందించకపోవడం సరైనది కాదని ఆయన విమర్శించారు. అనేక ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు, స్థలాలు పంచామని  ప్రచారం చేసుకుని, ఇప్పుడు నిర్మాణాలు చేసుకుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే దీనిపై, అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను కూడగట్టుకొని గుడిసెలు వేపిస్తామని కొప్పుల శంకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోన్ కమిటీ సభ్యులు దండిగారు సతీష్, సీపీఎం శాఖ కార్యదర్శి దాసరి మొగిలి పాల్గొన్నారు.
Spread the love