భద్రాద్రి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
భద్రాద్రి ఆలయంలో ఇవాళ సీతారాముల జగత్కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి ఆలయంలో వైభోపేతంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా భద్రాద్రి క్షేత్రం ముస్తాబైంది. మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరగనుంది. కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తజనం చేరుకుంటున్నారు. సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్రువమూర్తుల కల్యాణం జరిపి, అలంకారం అనంతరం ఊరేగింపుగా మిథిలా మండపానికి కల్యాణమూర్తులను అర్చకులు తీసుకురానున్నారు. ఉదయం 10.30 నుంచి 12.30 నిమిషాల వరకు స్వామివారి కల్యాణ క్రతువు జరగనుంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఇప్పటికే భద్రాచలం పుర వీధులు శ్రీ రామనామస్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారి కల్యాణానికి తరలివచ్చిన భక్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్ల ఏర్పాటు చేశారు.

Spread the love