దళిత వ్యక్తులను కొట్టి, మురికి తినిపించి…

నవతెలంగాణ- భోపాల్‌: బాలికలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు దళిత వ్యక్తులను ముస్లిం కుటుంబీకులు కొట్టారు. వారి మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. అంతేగాక దళిత వ్యక్తులతో బలవంతంగా మురికిని తినిపించారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాలికలను వేధిస్తున్నారని, రహస్యంగా వీడియో తీశారంటూ ఇద్దరు దళిత వ్యక్తులపై ముస్లిం వ్యక్తులు ఆరోపించారు. వారిని పట్టుకుని కొట్టారు. మెడలో చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. జూన్‌ 30న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై స్పందించారు. దళిత వ్యక్తులను కొట్టడంపై ఆరా తీశారు. అయితే వారిపై చేసిన ఆరోపణలు తప్పని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో తప్పుడు ఆరోపణలతో కొట్టడం, అవమానించడంపై దళిత వ్యక్తుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ముస్లిం కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అలాగే అటవీ భూమిలో ఉన్న నిందితుల ఇంటిని నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.

Spread the love