– డెడ్ స్టోరేజ్ లెవల్‌కు నీరు
– 524 అడుగులకు పడిపోయిన ప్రాజెక్టు నీటినిల్వ
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎండలు మండుతున్నాయి.. వర్షాల్లేవు.. భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి.. నాగార్జున సాగర్‌లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. డేంజర్ బెల్స్ మోగు తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు జటిలమవుతున్నాయి. డెడ్ స్టోరేజ్ లెవల్‌కు సాగర్ నీరు చేరుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయి.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు కాగా, 170 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 131 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. వేసవి అవసరాలకు 55 టీఎంసీలు అవసరం కాగా, ప్రస్తుతం డెడ్ స్టోరేజీ పోగా 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, వేసవి అవసరాలకు 15 టీఎంసీల నీటి కొరత ఉంది.
524.60 అడుగుల వద్ద ప్రాజెక్టు నీటి నిల్వ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 524.60 అడుగుల వద్ద ఉంది. డ్యామ్ నీటి సామర్థ్యం 312 టీఎంసీలుగాను, ప్రస్తుతం 157.500 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి, ఎడమ కాలువలకు ఒక చుక్క నీరు కూడా విడుదల చేయడం లేదు. కేవలం హైదరాబాద్ మహానగరానికి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ ఆదేశాల ప్రకారం ఇరు రాష్ట్రాలకు సంబంధించి కుడి, ఎడమ కాలువలకు, పవర్ హౌస్‌కు ఎలాంటి నీటి కేటాయింపులు లేవు.
రివర్ మేనేజ్‌మెంట్ సమావేశం వాయిదా
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ఈవారంలో మొదటి దఫా మీటింగ్ ఉండాల్సి ఉండగా వాయిదా పడింది. రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు రెండు నెలల పాటు ఎలా వాడుకోవాలి.. తాగునీటికి ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంటు దృష్టి సారించనుంది.
పొంచి ఉన్న ప్రమాదం..
ఈసారి వర్షాలు పడటానికి ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ సూచించడంతో రానున్న కాలంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదు. ఋతుపవనాలు ఆలస్యమైతే కృష్ణా పరివాహకం ప్రమాదంలో పడినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాగునీటికి సమస్య లేదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో నల్లగొండ, హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్యా లేదు. వ్యవసాయ రంగా నికి మాత్రం ప్రస్తుతం నీరు విడుదల చేసే పరిస్థితి లేదు.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున్‌రావు



