Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాన్ రాజీనామాపై ప్రతిష్టంభన

ప్రధాన్ రాజీనామాపై ప్రతిష్టంభన

- Advertisement -

పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ఆందోళ‌న‌లు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై పార్ల‌మెంట్‌లో ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సా గుతోంది. పార్ల‌మెంట్ లోప‌ల‌, వెలుప‌ల ఆందో ళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సహా ప్రధాని మోడీ సభాముఖంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. శుక్ర‌వారం పార్ల‌మెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద వ‌ర్షంలో ఇండియా బ్లాక్ ఎంపీలు నిరసన చేపట్టారు. ‘ప్రధాన్‌ను తొలగించాలి’ అనే బ్యానర్లతో నినాదాల హోరెత్తించారు. మ‌రోవైపు లోక్‌సభ, రాజ్యసభల్లో పేపర్ లీక్‌లపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో కూడా ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ‌ను స్పీక‌ర్ సోమ‌వారానికి వాయిదా వేశారు. లోక్‌స‌భ‌లో కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ నీట్‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షాల‌తో చెప్పాన‌ని, దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ హామీ ఇచ్చార‌ని అన్నారు. సోన‌మ్ వాంగ్‌చెక్ త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించార‌ని, ఆయ‌న కూడా స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశించార‌ని తెలిపారు. ఒక‌వేళ ఇప్పుడు చ‌ర్చ చేప‌ట్ట‌కుంటే, అది స‌రైన సందేశాన్ని ఇవ్వ‌బోదని అన్నారు. ఈ అంశంపై చర్చకు ముందుగా మంత్రి ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తన పేరు ప్ర‌స్తావించి, సభా కార్యకలాపాలను కొనసాగించనివ్వాలని ప్రతిపక్ష ఎంపీలను కోరినప్పటికీ, తనను సభలో మాట్లాడటానికి అనుమతించలేదని అన్నారు. ‘‘సాధారణ నియమావళి ప్రకారం, ఎవరైనా ఒకరి పేరు ప్రస్తావిస్తే ఆ వ్యక్తి స్పందించాలి, కానీ నేను స్పందించాలనుకున్నప్పుడు నన్ను మాట్లాడనివ్వలేదు” అని అన్నారు. “నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. విద్యార్థులకు మూడు డిమాండ్లు ఉన్నాయి. అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి వైదొలగాలి. విద్యార్థులను కొట్టిన వారిపై చర్య తీసుకోవాలి. ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. “ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించే వరకు మేము ఎలాంటి చర్చలు జరపబోము” అని అన్నారు.

రాజ్యసభలోనూ..
రాజ్య‌స‌భలో కూడా నీట్ పేప‌ర్ లీక్ అంశంపై ప్ర‌తిప‌క్ష‌లు చ‌ర్చకు ప‌ట్టుప‌ట్టాయి. విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. తొలుత 12 గంట‌ల‌కు స‌భ వాయిదా వేశారు. ఆ త‌రువాత ప్రారంభ‌మైన స‌భ‌లో కూడా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ప్ర‌ధాన్ రాజీనామాకు ప‌ట్టుప‌ట్టారు. దేశ‌ రాజధానిలో నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ తో సహా పోలీసుల చర్య గురించి మాట్లాడటానికి రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే లేచారు. సభలో గందరగోళం చెలరేగడంతో మధ్యాహ్నం గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే, ప్రతిపక్ష ఎంపీల నిరసనలు కొనసాగుతుండటంతో సభను సోమ‌వారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో వందేమాతరం బిల్లు
విద్యార్థుల ఆందోళన నుంచి దృష్టి మళ్లించడానికే ఇదిః ప్ర‌తిప‌క్షం
వందేమాతరం గేయానికి చట్టబద్ధ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. శుక్రవారం రాజ్యసభలో ‘వందేమాతరం బిల్లు’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. ‘‘1971 నాటి ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం’ను సవరించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుత చట్టం ప్రకారం, జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాల పట్ల అగౌరవ చర్యలకు పాల్పడిన వారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ప్రతిపాదిత సవరణ వందేమాతరానికి కూడా అదే విధమైన రక్షణను కల్పించాలని కోరుతోంది. ఈ బిల్లు ప్రకారం, జాతీయ గీతాన్ని ఆలపించడంలో ఆటంకం కలిగించినా లేదా ఏ రూపంలోనైనా దానిని అవమానించినా, అది చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అవుతుంది’’ అని పేర్కొన్నారు. అయితే.. ఈ బిల్లుపై ప్ర‌తిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సభలోనే ఆందోళనకు దిగారు. బిల్లు వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 67 కింద నోటీసు ఇచ్చారు. “ఒక చట్టంతో దేశభక్తిని, జాతీయవాదాన్ని సృష్టించలేరు” అని ఆయన అన్నారు. రాజ్యాంగం, పార్లమెంటు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన వందేమాతరంకు చట్టబద్ధమైన హోదా, శిక్షా రక్షణను కల్పించడమే ఈ బిల్లు లక్ష్యమని బ్రిట్టాస్ అన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24 నాటి ప్రకటనను ఉటంకించారు. ఈ విషయంపై రాజ్యాంగ పరిషత్ అధికారిక తీర్మానాన్ని ఆమోదించకూడదని నిర్ణయించుకుందన్న విషయాన్ని అది విస్మరించిందని పేర్కొన్నారు. ఫలితంగా, ఆ ప్రకటనకు ఎన్నడూ రాజ్యాంగ బలం చేకూరలేదని ఆయన అన్నారు. దాదాపు మూడేళ్ల‌ చర్చల అనంతరం రాజ్యాంగ పరిషత్తు జాతీయ గీతానికి, జాతీయ గేయానికి సమాన రాజ్యాంగ హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని, ఈ బిల్లు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. వందేమాతరం మొదటి రెండు చరణాలకే అధికారిక వినియోగాన్ని పరిమితం చేసే చారిత్రక ఏకాభిప్రాయాన్ని కూడా ఆయన ఉదహరించారు. ఈ బిల్లు, రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల గౌరవాన్ని ప్రాథమిక విధులుగా పేర్కొనే ఆర్టికల్ 51ఎ(ఎ)కి విరుద్ధంగా ఉందని, అందులో జాతీయ గీతం గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నివారణ చట్టాన్ని కూడా ఉదహరించారు. దీని ప్రకారం పార్లమెంట్ సెక్షన్ 3 కింద శిక్షా రక్షణను కేవలం జాతీయ గీతానికి మాత్రమే పరిమితం చేసిందని అన్నారు. బిజో ఇమ్మాన్యుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ జాతీయ గీతానికి సంబంధించిన ప్రవర్తనను నేరంగా పరిగణించడం వాక్ స్వాతంత్య్రం, అంతరాత్మ స్వేచ్ఛ, మత స్వేచ్ఛను పరిమితం చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టికల్స్ 14, 19(1)(ఎ), 21, 25 కింద ఆందోళనలను లేవనెత్తారు. జనవరిలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ గేయంపై ప్రోటోకాల్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, ఆ ప్రోటోకాల్‌కు ఎటువంటి శిక్షాత్మక పరిణామాలు లేవనే ఏకైక కారణంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించిందని, అయితే ఈ బిల్లు ఆ వైఖరిని తలకిందులు చేస్తుందని ఆయన అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి నిరాకరించాలని చైర్మన్ సిపి రాధాకృష్ణన్‌ను బ్రిట్టాస్ కోరారు. సిపిఐ ఎంపి పి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన నుండి దృష్టి మరల్చడానికే వందేమాతరం బిల్లును తీసుకువచ్చారని పేర్కొన్నారు. “నాకు వందేమాతరం అంటే చాలా ఇష్టం, కానీ ఈ బిల్లు ఠాగూర్, బంకిం చంద్రల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నందున నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -