నీట మునిగిన ఢిల్లీ

నీట మునిగిన ఢిల్లీ– 88 ఏండ్ల తరువాత రికార్డు వర్షపాతం
– కూలిన విమానాశ్రయం టెర్మినల్‌ 1 పైకప్పు
– ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ – దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నుంచి ప్రారంభమైన ఈ భారీ వర్షాలతో ఢిల్లీ నీట మునిగింది. అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా, ట్రాఫిక్‌ జామ్‌, విద్యుత్‌- మంచి నీటి సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలతో జనజీవనం అవస్థవ్యవస్థమయింది. 24 గంటల వర్షపాతం విషయంలో 88 ఏండ్ల తర్వాత రికార్డుస్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 వరకు 24 గంట వ్యవధిలో ఢిల్లీలో 228 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. 1936 జూన్‌లో 24 గంటల వ్యవధిలో 235.5 మీమీ వర్షపాతం తరువాత ఇదే అత్యధికమని చెప్పారు. సాధారణంగా జూన్‌లో సగటును 80.6 మీమీ వర్షపాతం కురుస్తుంది. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ వాతావరణం చల్లబడింది. గత రెండు నెలల నుంచి ఢిల్లీలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. భారీ వర్షాలతో ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో సాధారణ ప్రజలే కాదు.. ఎంపీలు సైతం ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో ఎస్‌పి ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ పార్లమెంటుకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. దీంతో ఆయన సిబ్బంది చేతుల్లో మోసి కారులో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లేందుకు నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఉదయం 4 గంటల నుంచి ఎంసీడీ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. రోడ్డుపై నిలిచిన వర్షం నీటిని మోటార్‌ ద్వారా తొలగించి ఉంటే బాగుండేది. రెండు రోజుల కిందటే బంగ్లా మొత్తం ఫ్లోరింగ్‌ పనులు చేయించాము. వర్షం వల్ల లక్షల్లో నష్టం వాటిల్లింది.’ అని తెలిపారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహణ లోపంపై ఆయన మండిపడ్డారు.
తన ఒక్క బంగ్లానే కాదు.. హోమ్‌శాఖ సహాయ మంత్రి, ఆర్మీ జనరల్స్‌, నేవీ అడ్మిరల్స్‌ బంగ్ల్లాలు కూడా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయని, వీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని రామ్‌ గోపాల్‌ యాదవ్‌ చెప్పారు. ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు చాలా కాలనీల్లో విద్యుత్‌, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మింటో రోడ్డులో ఒక ట్రక్కు పూర్తిగా నీట మునిగింది.
కూలిన విమానాశ్రయం టెర్మినల్‌ 1 పైకప్పు – ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌1 పై కప్పు కూలిపోయింది. శుక్రవారం ఉదయం 5:00 గంటల సమయంలో డిపార్చర్‌ గేట్‌ 1, గేట్‌ 2 వద్ద టెర్మినల్‌ 1 పై కప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒక క్యాబ్‌ డ్రైవర్‌ మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం వార్త తెలిసినవెంటనే సంఘటన స్థలానికి అధికారులు మూడు ఫైర్‌ టెండర్లను తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని మేదాంత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. వీటిలో ఒక కారు నుంచి ఒకరిని రక్షించారు. ఈ ప్రమాదంతో టెర్మినల్‌ 1ను పూర్తిగా ఖాళీ చేసి మూసివేశారు. ప్రమాద ప్రాంతాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. మృతి కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ .3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కాగా, టెర్మినల్‌ 1 డిపార్చర్‌ హాల్‌ను విస్తరణ పనుల తరువాత ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే శుక్రవారం ఉదయం కుప్పకూలిన భవనం యొక్క భాగాన్ని 2008-2009లో నిర్మించారని మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలపడం విశేషం. కాగా, టెర్మినల్‌ 1 పై కప్పు కూలడం, భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులను శుక్రవారం, శనివారం రద్దు చేశారు. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. తమ విమాన సర్వీసులను నిర్థారణ చేసుకున్న తరువాతే వినియోగదారులు విమానశ్రయానికి రావాలని ఇండిగో వంటి సంస్థలు ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశాయి. అదేవిధంగా ఢిలీల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Spread the love