విదేశీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి
అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్..ఆటోలకు ఉచితంగా ఈవీలుగా మార్పు
సర్ పేరుతో ఓట్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోం
హజ్ యాత్రీకులకు కేంద్రం పెంచిన చార్జీలను రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుంది
హజ్ యాత్రికుల బస్సులను జెండాఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా బ్లూ కలర్ జాబ్స్ కు డిమాండ్ పెరుగుతున్నదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో వైట్ కాలర్ ఉద్యోగాల కోసం పోటీ ఉండేదనీ, ఇప్పుడు విదేశీ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. దానికోసమే రాష్ర్టంలో ఉన్న ఐటీఐ కేంద్రాలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా అభివృద్ధి చేశామన్నారు. శుక్రవారం నాంపల్లిలోని హజ్ హౌస్ నుంచి బయల్దేరుతున్న హజ్ యాత్రికుల బస్సులను ఆయన జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారనీ, అలాంటి ఘటనలు హృదయాలను కలచివేస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రమాదంలో మరణించిన ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకున్నదని చెప్పారు. సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో మైనార్టీల వాటాలు వారికే వందశాతం అందచేస్తున్నామన్నారు. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో చాలామంది మైనారిటీలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారనీ, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఎలక్ర్టికల్ వెహికల్ ఆటోగా మార్చాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. ‘సర్’ పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారనీ, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని అన్నారు. దీనికోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయనీ, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రీకుల ప్రయాణంపై అదనపు ఆర్థిక భారాలు మోపిందని గుర్తుచేశారు. అయితే ఆ భారాలు వారిపై పడకుండా రాష్ర్ట ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందన్నారు. తమకు హిందూ ముస్లిం భేదాభిప్రాయం లేదనీ, ప్రజా సంక్షేమంలో అందర్నీ సమానంగానే చూస్తామన్నారు. తమ నినాదం ‘హిందూ ముస్లిం భాయీ భాయీ ’ అనేనని స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనీ, దానికి ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టీజీఎమ్‌ఆర్‌ఈఐఎస్ అధ్యక్షులు ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మె గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టీజీఎమ్‌ఎఫ్‌సీ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



