Saturday, May 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహార్ముజ్‌లో కాల్పులు

హార్ముజ్‌లో కాల్పులు

- Advertisement -

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు

టెహ్రాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతి దాడులు
ఒప్పందంపై వెంటనే సంతకం చేయండి : ట్రంప్
యూఏఈ పైనా ఇరాన్ దాడులు
యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం : వాషింగ్టన్ పోస్ట్
దెబ్బతిన్న 15 సైనిక స్థావరాలలోని 228 నిర్మాణాలు
ఫ్లోరిడాకు మారిన అమెరికా నేవీ కేంద్ర కార్యాలయం

నవతెలంగాణ – జనరల్ డెస్క్
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధి ప్రాంతం దాడులు, ప్రతి దాడులతో అట్టుడికిపోయింది. హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న తన యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న చిన్న పడవలతో దాడి చేసిందని ఆరోపించిన అమెరికా…అందుకు ప్రతిగా టెహ్రాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ‘ఇరాన్ దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండా జరిపిన దాడులను ఆత్మరక్షణ కోసం అడ్డుకొని తిప్పికొట్టాం. అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్థలు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలను నాశనం చేసాయి’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి- డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, కమాండ్`కంట్రోల్ ప్రదేశాలు, ఇంటెలిజెన్స్- నిఘా యూనిట్లను అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని సెంట్రల్ కమాండ్ ప్రకటనను బట్టి తెలుస్తోంది. ఉద్రిక్తతలను తాము కోరుకోవడం లేదని, అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ కమాండ్ తెలిపింది.

ఒప్పందంపై వెంటనే సంతకం చేయండి : ట్రంప్
ఉద్రిక్తతలను మరింతగా పెంచవద్దని, ఒప్పందంపై తక్షణమే సంతకం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. దాడుల అనంతరం ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో వారిని మరింత కఠినంగా, మరింత హింసాత్మకంగా వేధిస్తాం. త్వరపడండి’ అని తెలిపారు. ‘మా డిస్ట్రాయర్లపై క్షిపణులను ప్రయోగించారు. వాటిని తేలికగానే కూల్చేశాం. అలాగే డ్రోన్లు వచ్చాయి. వాటిని గాలిలో ఉండగానే అడ్డుకున్నాం. అవి చాలా అత్యద్భుతంగా సముద్రంలో పడిపోయాయి. సీతాకోకచిలుకలు నేలరాలిన చందంగా…’ అంటూ రాసుకొచ్చారు. ఇరాన్ దాడులను ఆయన ‘స్నేహితులు సరదాగా కొట్టుకునే చిన్నపంచ’గా అభివర్ణించారు. కాల్పుల విరమణ కొనసాగుతూనే ఉన్నదని, అది అమలులోనే ఉన్నదని ఏబీసీ న్యూస్‌కు ఫోన్‌లో చెప్పారు. చర్చలలో అనిశ్చితి ఏర్పడిందని, అయినప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా చేసిన ప్రతిపాదన ఓ పేజీ కంటే ఎక్కువగానే ఉన్న ఆఫర్ అని, ఇరాన్ ఇప్పటి వరకూ తన స్పందనను ఖరారు చేయలేదని తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, వాటిని తమకు అప్పగించాలని అమెరికా ప్రతిపాదించిందని చెప్పారు. అందుకు ఇరాన్ కూడా అంగీకరించిందని తెలిపారు. అయితే అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ ఇంకా స్పందించలేదని టెహ్రాన్ మీడియా చెబుతోంది. కాగా బందర్ అబ్బాస్, ఖెష్మ్ సహా అనేక ప్రాంతాలపై సైనిక దాడులు చేశామని అమెరికా అధికారి ఒకరు చెప్పారు.

ఇరాన్‌లో పేలుడు శబ్దాలు
ఖెష్మ్ దీవిలోని బహ్‌మన్ పియర్ వద్ద ఉన్న వాణిజ్య కేంద్రాల వద్ద ఇరాన్ భద్రతా దళాలు, అమెరికా సేనల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని టెహ్రాన్ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ తెలిపింది. ఖెష్మ్ దీవి, బందర్ అబ్బాస్ సమీపంలో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పింది. టెహ్రాన్‌లో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న కొన్ని నౌకలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) హెచ్చరికలు జారీ చేస్తోంది.

యూఏఈ పైనా దాడులు
ఇరాన్ వైపు క్షిపణులు, డ్రోన్లు వచ్చి పడుతున్నాయని, వాటిని ఎదుర్కొనే పనిలో ఉన్నామని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ దేశవ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రశాంతంగా ఉండాలని, అధికారులు జారీ చేసే భద్రతాపరమైన ఆదేశాలను పాటించాలని ప్రజలను కోరారు.

హార్ముజ్‌పై ఇరాన్ నిబంధనలు
40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ హార్ముజ్ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఇరాన్ సిద్ధపడింది. సొంతంగా కొన్ని నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. పర్షియల్ గల్ఫ్ స్టేట్ అథారిటీ (పీజీఎసఏ)ని ఏర్పాటు చేసింది. హార్ముజ్ మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకలు విధిగా 40 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. నౌకలో ఉన్న సరుకు వివరాలు, దాని యజమాని, సిబ్బంది జాతీయత వంటి ప్రశ్నలను సంధించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే నౌకలు క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాక ఆ నౌకలను స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. హార్ముజ్‌లో కొత్త నిబంధనలు తీసుకొస్తామని అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచే ఇరాన్ చెబుతోంది. దానికి అనుగుణంగానే తాజాగా పీజీఎసఏను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల మేరకు హార్ముజ్‌లో నౌకలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ అమలులోకి తెచ్చిన తాజా నిబంధనల ప్రకారం…నౌకల గుర్తింపు నెంబర్లను, గతంలో వాటి పేర్లను సీపీఎసఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇరాన్‌పై అమెరికా‘ఇజ్రాయిల్ సేనలు దాడి చేయడానికి ముందు నౌకలు స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా హార్ముజ్‌లో ప్రయాణించేవి. అయితే ఘర్షణలు మొదలైన తర్వాత ఐఆర్‌జీసీ అనుమతి తీసుకోకుండా జలసంధిని దాటే ప్రయత్నం చేస్తే దాడులను ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే అనేక నౌకలపై దాడులు జరిగాయి కూడా. ఇరాన్ హెచ్చరికలకు భయపడిన అనేక నౌకల యజమానులు, ఆపరేటర్లు హార్ముజ్ వైపే చూడడం లేదు.

యూఏఈ పైనే ఇరాన్ గురి ఎందుకు?
వానా : పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీరంలో ఉన్న చిన్న ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు లక్ష్యంగా మారిన ప్రధాన దేశాలలో ఇది కూడా ఒకటి. దీనికి కారణమిటని విశ్లేషిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అనేక దశాబ్దాలుగా యూఏఈలోని అల్ నహ్యాన్ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు, దాని ప్రవర్తన ఇందుకు కారణమని కొందరు అభిప్రాయపడ్డారు. పర్షియన్ గల్ఫ్ దేశాలలో యువ దేశం యూఏఈయే. అది ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్‌కు చేరువు అవుతోంది. పశ్చిమాసియాలో అమెరికా వెన్నుదన్నులున్న ప్రాంతీయ క్రమానికి క్రమేపీ ఓ స్తంభంగా మారుతోంది.

పరిమిత జనాభా, చిన్న భూభాగం, ఆర్థికంగా ఎవరో ఒకరిపై ఆధారడాల్సి రావడం వంటి కారణాలతో అబూధాబీ, ఇతర ఎమిరేట్స్ తమ చమురు ఎగుమతులు, వాణిజ్య కార్యకలాపాల కోసం అమెరికా భద్రతా గొడుగులోకి చేరాయి. ఎమిరేట్స్ భూభాగంలో అమెరికా సైనిక బలగాల ఉనికి పెరిగింది. భద్రతా పరంగా అది అమెరికాపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అమెరికా భౌగోళిక రాజకీయ చట్రంలోకి యూఏఈ చాలా లోతుగా వెళ్లిపోయింది. చమురు ఆదాయం ద్వారా సమకూరిన అపార సంపద కారణంగా దుబాయి, అబూధాబీ విస్తరణ వేగవంతమైంది. దీంతో యూఏఈ తన సరిహద్దు వెలుపల కూడా ప్రభావాన్ని చూపగలిగింది. యెమన్, సూడాన్, సిరియాలలో నెలకొన్న ప్రాంతీయ పరిణామాలలో యూఏఈ పాత్ర స్పష్టంగా కన్పిస్తోంది.
అప్రకటిత కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన సుమారు 20 రోజుల తర్వాత పర్షియల్ గల్ఫ్‌లో మరోసారి పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈసారి యూఏఈ ప్రధాన లక్ష్యంగా మారింది. దీనిని టెహ్రాన్ నుంచి వచ్చిన ప్రత్యక్ష సందేశంగా భావించవచ్చు. అమెరికా సైన్యానికి యూఏఈ ఆర్థికంగా అండదండలు అందిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఇజ్రాయిల్‌కు చెందిన కొన్ని భద్రతా కార్యక్రమాలలో కూడా యూఏఈ పాత్ర స్పష్టంగా కన్పిస్తోంది. అబ్రహం ఒప్పందంలో మొదటి సభ్యదేశంగా, ఇజ్రాయిల్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటున్న అరబ్ దేశంగా యూఏఈ ఆవిర్భవించింది. యూఏఈ, అమెరికా మధ్య సైనిక, ఆర్థిక, భద్రతా సంబంధాలు విస్తరించాయి. అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు అరబ్ దేశాలలో యూఏఈ ఆతిథ్యమిస్తోంది. ఇరాన్ తీర ప్రాంతం సమీపంలో మొస్సాద్, సీఐఏలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కేంద్రాల కార్యకలాపాలను అనేక నివేదికలు వేలెత్తి చూపాయి. ఇజ్రాయిల్‌కు చెందిన గగనతల రక్షణ మౌలిక సదుపాయాలలో కొన్ని భాగాలను యూఏఈ భద్రతా వ్యవస్థతో అనుసంధానం చేశారు. తద్వారా ఇరాన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనే విషయంలో అబూధాబీ అమెరికా స్థావరాల సరసన చేరింది.

రంజాన్ యుద్ధ సమయంలో అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలో యూఏఈ భాగస్వామి అయింది. రంజాన్ నెల చివరి రోజు లావన్ దీవిలోని చమురు కేంద్రాలపై ఎమిరిటీ మిరేజ్ ఫైటర్ జెట్లే దాడులు చేశాయని కొందరు గుర్తు చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడులలో ఎమిరేట్స్ డ్రోన్ల ప్రమేయం ఉన్నదని నిరూపించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయని టెహ్రాన్ ఎంపీ మొట్టాకీ చెప్పారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే యూఏఈని ఒక అప్రధానమైన ప్రాంతీయ శక్తిగా కాకుండా విస్తృత ఇరాన్ వ్యతిరేక కూటమిలో ఓ భాగంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇరాన్‌పై అమెరికా చేపట్టబోయే సైనిక చర్యకు ఈ కూటమి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ దీవులపై నెలకొన్న ప్రాదేశిక వివాదాలు, పర్షియన్ గల్ఫ్ పేరుపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభిప్రాయబేధాలు వంటి పరిణామాలు కూడా యూఏఈని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేనని కొందరు అభిప్రాయపడ్డారు.

ఆరోపణలు…ప్రత్యారోపణలు
అమెరికా యుద్ధ నౌకలు యూఎస్ఎస్ ట్రక్స్‌టన్ (డీడీజీ 103), యూఎస్ఎస్ రఫేల్ పెరాల్టా (డీడీజీ 115), యూఎస్ఎస్ మాసన్ (డీడీజీ 87) అంతర్జాతీయ జలాలలో ప్రయాణిస్తుం డగా ఇరాన్ దళాలు అనేక క్షిపణులను ప్రయోగించాయని, అయితే అవేవీ తమ నౌకలను తాకలేకపోయాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదిలావుండగా ఖెష్మ్ దీవి, బందర్ ఖమీర్, సిరిక్ తీరాల వెంబడి ఉన్న పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడులు జరిపిందని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి ఒకరు ఆరోపించారు. హార్ముజ్ జలసంధి వైపుగా వెళుతున్న ఇరాన్ చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఈ దాడులకు ప్రతిగా జలసంధికి తూర్పు వైపుగా, ఛాబహార్ ఓడరేవుకు దక్షిణంగా ఉన్న అమెరికా సైనిక నౌకలపై దాడి చేశామని తెలిపారు.

యుద్ధంలో అమెరికాకు
భారీ నష్టం : వాషింగ్టన్ పోస్ట్
దెబ్బతిన్న 15 సైనిక స్థావరాలలోని 228 నిర్మాణాలు
ఫ్లోరిడాకు మారిన అమెరికా నేవీ కేంద్ర కార్యాలయం

ఇరాన్‌పై జరుపుతున్న యుద్ధంలో అమెరికా చెబుతున్న దాని కంటే భారీగానే నష్టాన్ని చవిచూసింది. ఇరాన్ వైమానిక దాడులలో అనేక అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక జరిపిన దర్యాప్తులో తేలింది. అమెరికాకు చెందిన పదిహేను సైనిక ప్రాంతాలలోని కనీసం 228 నిర్మాణాలు దెబ్బతిన్నాయని, ఏడుగురు సైనికులు చనిపోయారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆ పత్రిక వివరించింది. ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న బహ్‌రైన్‌లోని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్ కేంద్ర కార్యాలయాన్ని ఫ్లోరిడాలోని టాంపాకు మార్చారు. ఇరాన్ దాడులలో బహ్‌రైన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈలలో అమెరికాకు చెందిన విమాన హాంగర్స్, రాడార్ వ్యవస్థలు, పాట్రియట్థాడ్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఇంధన డిపోలు, వైమానికసిబ్బంది కేంద్రాలు, సౌదీ అరేబియాలోని కమాండ్ యుద్ధ విమానం దెబ్బతిన్నాయి. అమెరికా యుద్ధ సన్నాహాలలో తీవ్రమైన వైఫల్యాలు కన్పిస్తున్నాయని, ఇరాన్ నిఘా వ్యవస్థను తక్కువగా అంచనా వేశారని, అంతేకాక థాడ్, పాట్రియట్ ఇంటర్‌సెప్టర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు వేగంగా క్షీణించాయని నిపుణులు తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రాంతీయ రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ దాడులు బయటపెట్టాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించిన తర్వాత వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఈ నివేదికను రూపొందించింది. ఇరాన్ దాడులలో అమెరికా స్థావరాలకు జరిగిన నష్టానికి సంబంధించి వందకు పైగా ఉపగ్రహ చిత్రాలను టెహ్రాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. వాటిని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పరిశీలించింది. ఇరాన్ దాడులేవీ గురి తప్పలేదని నిర్ధారించుకుంది.

ట్రంప్‌నకు మరో షాక్
ప్రపంచ దేశాలపై విధించిన 
10 శాతం సుంకాలు చెల్లవన్న కోర్టు
వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పది శాతం సుంకాన్ని ఒక ఫెడరల్ కోర్టు 2-1 మెజారిటీతో కొట్టివేసింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని తెలిపింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరిలోనే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఆయా దేశాలపై పది శాతం చొప్పున తాత్కాలిక సుంకాలు విధించింది. ఇవి జూలై 24 వరకూ అమలులో ఉంటాయి. ట్రంప్ విధించిన పది శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 24 రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. సుంకాలపై అధ్యక్షుడికి అమెరికా ప్రతినిధిసభ కల్పించిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని, ఆయన విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమైనవని తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతి రేకించగా ఒకరు మాత్రం దానిని సమర్ధిం చారు. సుంకాల విషయంలో అధ్యక్షు డికి చట్టం ద్వారా విస్తృత అధికారాలు లభించాయని ఆయన తెలిపారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -