ప్రజాస్వామ్యమా…నీవెక్కడీ

Democracy...where are you?– అరెస్టులు…నిర్బంధాలు…
– వేధింపులతో ప్రతిపక్షాల ఉక్కిరిబిక్కిరి
–  నోటీసులు…ఖాతాల స్తంభనతో అష్టదిగ్బంధం
–  కరపత్రాలు, పోస్టర్లకూ డబ్బు లేని దుస్థితి
–  ప్రేక్షక పాత్ర వహిస్తున్న రాజ్యాంగ సంస్థలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోందా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు…పాలనా యంత్రాంగం, పోలీసులు, ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయపన్ను శాఖ … తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ సైతం కొంత మేర ఇందులో భాగస్వామి అవుతోంది.
వెంటాడి…వేటాడుతూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు సైతం కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత పరిస్థితి కూడా అంతే. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ రెండు నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు. మిగిలిన ప్రతిపక్ష నేతలను కూడా ఏ క్షణంలో అయినా, ఏ కారణం చేతనైనా అరెస్ట్‌ చేయవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినాటేను మహిళా కమిషన్‌, ఎన్నికల కమిషన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలు కొంతకాలంగా వెంటాడుతు న్నాయి. ఆమెను జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సుప్రియ సోషల్‌ మీడియా అకౌంటులో వచ్చిన ఓ వ్యాఖ్య దీనింతటికీ కారణం. తన సోషల్‌ మీడియా అకౌంటును దుర్వినియోగం చేసి, ఎవరో ఈ వ్యాఖ్య పెట్టారని ఆమె వివరణ ఇచ్చారు. అందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ వ్యాఖ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పదేపదే అన్నారు. అయినా ఆమెను వదలడం లేదు.
పార్టీలనూ వదలడం లేదు
నాయకులనే కాదు…పార్టీలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు, అధికారులు వదిలిపెట్టడం లేదు. రూ.11 కోట్ల పన్ను బకాయి చెల్లించాలంటూ సీపీఐకి నోటీసు ఇచ్చారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఏకంగా పదిహేను నోటీసులు అందాయి. రూ.1,800 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీకి తాఖీదు పంపారు. తనకు రావాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు అంతకుముందే ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీ బ్యాంక్‌ ఖాతా నుండి ఏ ప్రభుత్వ విభాగమైనా ఎలా సొమ్మును విత్‌డ్రా చేసుకుంటుంది? ఆదాయపన్ను శాఖకు బీజేపీ ఏమైనా బకాయి పడిందా అనే విషయంపై ఏ కార్పొరేట్‌ మీడియా సంస్థ అయినా అధికారులను ప్రశ్నిస్తోందా?
బీజేపీలో కలిసిపోయిన ప్రభుత్వ విభాగాలు
ఈవీఎంలపై కూడా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్‌ మాత్రం తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఎన్నికల ప్రక్రియే అవినీతిలో కూరుకుపో యినప్పుడు, పక్కదారి పట్టినప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఎలా ఆశించగలం? దేశంలో కార్పొరేట్‌ మీడియా గత పది సంవత్సరాలుగా బీజేపీ కొమ్ము కాస్తోంది. ప్రతిపక్షాల వాణిని వినిపించకుండా చేస్తోంది. అధికార పార్టీ నిరంకుశంగా వ్యవహరించినప్పుడు మిగిలిన సంస్థలు కలసికట్టుగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల రక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వంలోని అన్ని అంగాలూ బీజేపీలో కలిసిపోతే ఇక అడిగేవారెవరు? చివరికి సైనికాధికారులు కూడా బీజేపీ భాషలోనే మాట్లాడుతున్నారు. ఇది ఆశ్చర్యకరం, ఆందోళనకరం.
జైలా ? దర్యాప్తు సంస్థ కార్యాలయమా?
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ లోక్‌సభ ఎన్నికలను అవినీతిమయం చేశాయంటూ ప్రభుత్వాలపై ఆరోపణలేవీ రాలేదు. అధికార పార్టీకి తప్పనిసరిగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయినా ప్రతిపక్షాల విషయంలో నిస్పాక్షికంగానే వ్యవహరించే వారు. దేశంలో నియంతలా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ సైతం ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్ష నాయకులను జైళ్ల నుండి విడుదల చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు జైలులోనో లేదా దర్యాప్తు సంస్థల కార్యాలయాలలోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
సర్కారు సొమ్ముతో ప్రచారం
ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ బీజేపీకి పోటీయే లేదని చెప్పుకుంటున్నారు. ప్రధానమంత్రికి విశేషంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత మోడీ భూటాన్‌లో పర్యటించి ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ఆ విధంగా ఆయన ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు.
నిధుల కొరతలో కాంగ్రెస్‌
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ నిద్ర లేచినట్లు కన్పిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ శాఖ రంగంలోకి దిగింది. దానికి డబ్బు కావాలి. దానితో పాటు తమ అధినేతల ప్రాపకం కూడా కావాలి. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కాంగ్రెస్‌ వద్ద డబ్బే లేకుండా పోయింది. ఎన్నికల ప్రచారానికీ సొమ్ము లేదు. కనీసం కరపత్రాలు, పోస్టర్లు ముద్రించడానికి లేదా నేతల రైలు, విమాన ప్రయాణ టిక్కెట్లు కొనుగోలు చేయడానికి కూడా పైసలు లేని పరిస్థితి.
ప్రశ్నించలేకపోతున్న మీడియా, ఈసీ
పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి నాయకులు ఓ వైపు సంసిద్ధులవుతుంటే మరోవైపు వివిధ దర్యాప్తు సంస్థలు ఒక దాని వెంట మరొకటి సమన్లు జారీ చేస్తూ చీకాకు కలిగిస్తు న్నాయి. తమ ఎదుట హాజరు కావాలంటూ తాఖీదులు పంపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతలు ఇక ఎలా ప్రచారానికి వెళతారు? ఇంత జరుగుతుంటే ప్రజలు మౌనంగా చూస్తూ ఉండి పోవాల్సిందేనా? కార్పొరేట్‌ మీడియా ఎందుకు ప్రశ్నించదు? ఆ సంస్థలను ఎన్నికల కమిషన్‌ ఎందుకు నియంత్రించదు? న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకోవు? దాడులు, ఆంక్షలు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు తమ తమ పార్టీలను వదిలేసి ఎందుకు వెళ్లిపోతున్నారో, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.
ప్రతిపక్షాల చేతులు కట్టేసి…
ఐదు సంవత్సరాల విచారణ తర్వాత ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది…అది కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు. అప్పటికే బీజేపీ ఖాతాలో వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీలు దానితో పోటీ పడలేకపోయాయి. ఒకవేళ ఆయా పార్టీలకు కొద్దో గొప్పో నిధులు అందినా వాటిని దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ జరుగుతోంది ఏమిటి? ప్రతిపక్షాల చేతులు కట్టేశారు. ఇక ఆయా పార్టీల నాయకులు ప్రచారంలో బీజేపీతో ఎలా పోటీ పడగలరు?

Spread the love