రక్షణ శాఖ ‘ సెల్ఫీ’ ప్రచారం !

Defense Department 'Selfie' Campaign!– అందులో మోడీ ఫొటో తప్పనిసరి అట
– దేశవ్యాప్తంగా 822 పాయింట్ల ఏర్పాటు
– తమను రాజకీయ రొచ్చులోకి లాగవద్దంటున్న మాజీ సైనికాధికారులు
– ఎన్నికల వేళ సబబు కాదంటూ హితవు
న్యూఢిల్లీ : సెల్ఫీలంటే అందరికీ మోజే. సెల్ఫీ దిగి దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసే వరకూ మనశ్శాంతి ఉండడం లేదు మరి. సెల్ఫీలపై ప్రజలకున్న క్రేజ్‌ను సొమ్ము చేసుకొని, తద్వారా తన మంత్రిత్వ శాఖ సాధించిన ఘనకార్యాలకు, పనిలో పనిగా ప్రభుత్వ పథకాల పేరుతో ప్రధానమంత్రికి ప్రాచుర్యం కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ భావించింది. ఇందులో భాగంగా రక్షణ రంగంలో చేసిన మంచి పనులను చాటిచెప్పే సెల్ఫీ పాయింట్లను దేశంలోని కీలక నగరాలలో ఏర్పాటు చేయాలని తన అనుబంధ విభాగాలు, సంస్థలను ఆదేశించింది. అయితే ఈ సెల్ఫీ పాయింట్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో విధిగా ప్రముఖంగా కన్పించాలంటూ షరతు విధించింది. దేశవ్యాప్తంగా 822 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. స్వకార్యంతో పాటు స్వామికార్యాన్ని కూడా నెరవేర్చాలన్నది రక్షణ శాఖ ఆలోచనగా కనిపిస్తున్నది.
స్వావలంబన, సాధికారత వంటి అంశాలతో పాటు డీఆర్‌డీఓ, రక్షణ ఉత్పత్తుల సంస్థ కలిసి ‘పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ’ అనే అంశంపై సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేయనున్నాయి. వీటి ఏర్పాటులో త్రివిధ దళాలు భాగస్వాములవుతాయి. ఈ మేరకు రక్షణ పద్దుల కంట్రోలర్‌ జనరల్‌ ఈ నెల 9న ఓ నోట్‌ జారీ చేశారు. అంతేకాదు…దీనిపై వెంటనే చర్యలు చేపట్టి ఆ నివేదికలను సమర్పించాలని రక్షణ శాఖ జాయింట్‌ సెక్రటరీ (సమన్వయం) ఆదేశించారు. పెన్షన్‌ ప్రయోజనాలు, అలవెన్సుల మంజూరు, మహిళా సాధికారత, స్వచ్ఛ భారత్‌ వంటి అంశాలతో పాటు వాక్సిన్‌ నుండి యోగా వరకూ, ఉజ్వల యోజన నుండి జల్‌ జీవన్‌ మిషన్‌ వరకూ ప్రభుత్వ పథకాలు, విధానాలను సెల్ఫీ పాయింట్ల వద్ద ప్రదర్శిస్తారు.
మాజీ అధికారులు ఏమంటున్నారు?
అయితే రక్షణ శాఖ నిర్ణయంపై త్రివిధ దళాల మాజీ అధిపతులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం సబబు కాదని వారు తెలిపారు. అదీకాక సంప్రదాయకంగా రాజకీయాలకు రక్షణ శాఖ దూరంగా ఉంటోందని, ఇప్పుడు దానిని రాజకీయ ప్రచారంలోకి లాగవద్దని వారు కోరారు. సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని, వాటిని రాజకీయ రొచ్చులో దింపవద్దని సైనిక దళాల మాజీ ప్రధానాధికారి రిటైర్డ్‌ జనరల్‌ వేద్‌ ప్రకాష్‌ మాలిక్‌ సూచించారు. ఇలా చేయడం సాయుధ దళాల ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు. కార్గిల్‌పై తాను రాసిన పుస్తకంలో ‘మమ్మల్ని ఒంటరిగా వదలండి…మాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అనే పేరుతో ఓ ఛాప్టర్‌నే రాశానని గుర్తు చేశారు.
సెల్ఫీ పాయింట్ల ఉద్దేశమేమిటి..?
అసలు ఇలాంటి ఆలోచనే రాకూడదని నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాష్‌ అన్నారు. ఈ కార్యక్రమం సాయుధ దళాలపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ‘సెల్ఫీ పాయింట్ల ఉద్దేశమేమిటో నాకు స్పష్టంగా తెలియడం లేదు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రభావం కోసం సాయుధ దళాలను ఉపయోగించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రక్షణ శాఖ ఇలాంటి ఆలోచనే చేయకూడదు. దళాల మనోబలం, పొందికపై రాజకీయాలు చూపే దీర్ఘకాలిక ప్రభావాల గురించి సైనిక నాయకత్వం వివరిస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
అయితే మాజీ అధికారుల అభిప్రాయాలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ న్యూఢిల్లీ, నాసిక్‌, ప్రయాగరాజ్‌, కొల్లాం, పూనే, కొల్‌కతా, బెంగళూరు, గౌహతి, మీరట్‌ నగరాలలో సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు రక్షణ పద్దుల కంట్రోలర్‌ జనరల్‌ ఆమోదముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో గత నెల 14న జరిగిన సమావేశంలోనే సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని రక్షణ శాఖ విడుదల చేసిన నోట్‌ చెబుతోంది. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, ప్రజల దృష్టిని ఆకర్షించగలిగే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధ స్మారక కేంద్రాలు, రక్షణ మ్యూజియంలు, రైళ్లు, మెట్రో-బస్‌ స్టేషన్లు, విమానా శ్రయాలు, మాల్స్‌, పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, చివరికి పండుగల సందర్భంగా ప్రజలు సంతోషంతో కలిసే ప్రదేశాలలో కూడా ఇకపై మనకు సెల్ఫీ పాయింట్లు కన్పిస్తాయి. ప్రజలు అక్కడ సెల్ఫీలు దిగి ఆ చిత్రాలను రక్షణ శాఖకు పంపవచ్చు.

Spread the love