పౌర సమాజానికి చోటేది ?

What is the place for civil society?– విషం చిమ్ముతున్న పాలకులు
– పెరిగిన నిర్బంధాలు
–  అన్ని రంగాలదీ అదే తీరు
రాజకీయ, సామాజిక విషయాలలో వ్యక్తులు, పౌర సమాజ సంఘాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో, పారదర్శకతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో ముఖ్య భూమిక నిర్వహిస్తాయి. ముఖ్యంగా మానవ హక్కులకు విఘాతం ఏర్పడినప్పుడు, సమాజంలో అవినీతి జరిగినప్పుడు పౌర సమాజం గళం విప్పి ప్రభుత్వాలను నిద్ర లేపుతుంది. సామాజిక సంస్థలు కానీ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కానీ, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించే సంఘాలు కానీ చట్ట పరిధిలోనే బాధ్యతాయుతంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో పౌర సమాజం గొంతు విప్పి రాజకీయ, ఆర్థిక, పర్యావరణ ప్రాధాన్యత కలిగిన విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పాలకులు సహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దానిపై విషం చిమ్మడం, నేరాలు ఆపాదించడం పరిపాటిగా మారింది.
న్యూఢిల్లీ : దేశంలోని మధ్యతరగతి హిందూ కుటుంబాలపై హిందూత్వ రాజకీయాల ప్రభావం అధికంగా ఉంది. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థల ప్రచారమే దీనికి కారణం. ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, హిందూత్వ భావనలను గౌరవించేందుకు దేశానికి బలమైన నాయకుడు అవసరమని ఆ సంస్థలు ఊదరగొడుతున్నాయి. 2021లో హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో అనేకమంది సాధువులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. మైనారిటీలపై హింసకు పాల్పడాలంటూ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సేను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి ప్రతిగా 2022 మేలో కేరళలోని అలప్పుజాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఓ బాలుడు హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. మణిపూర్‌లో కుకీలు, మైతీల మధ్య జరిగిన ఘర్షణలు కూడా మతపరమైనవే. నూహ్ లో జరిగిన హింసాకాండ కూడా అలాంటిదే. ఈ సంఘటనలను గమనిస్తే దేశంలో పౌర సమాజానికి రానురానూ చోటు కుంచించుకుపోతోందని అర్థమవుతుంది.
2021 అక్టోబర్‌ నుంచి 2022 మార్చి వరకూ ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో విద్వేషపూరిత నేరాలకు సంబంధించి 89 కేసులు నమోదయ్యాయి. ఇటీవల రైల్వే రక్షణ దళానికి చెందిన కానిస్టేబుల్‌ ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కాల్చి చంపిన ఘటన ఈ నేరాలకు పరాకాష్ట. ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడు సాధారణంగా పౌర సమాజం స్పందిస్తుంది. కానీ మన దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరైనా గొంతు విప్పితే వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వంలోనే కాదు… ప్రభుత్వ సంస్థలలో సైతం ఇలాంటి అరాచకమే కన్పిస్తోంది. బెంగళూరులోని ఐఐఎంలో ఇటీవల జరిగిన ఘటనను నిరసిస్తూ 17 మంది బోధనా సిబ్బంది గళం విప్పారు.
కార్పొరేట్‌ సంస్థలదీ అదే దారి
దేశంలోని పలు కార్పొరేట్‌ సంస్థలు ఇలాంటి ఉదంతాలపై కనీస స్పందనను కూడా వ్యక్తం చేయడం లేదు. ఆ సంస్థలకు ఎంతసేపూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలన్న తాపత్రయమే కానీ ఇతర విషయాలు పట్టించుకోవు. అదే సంపన్న దేశాలలో దుష్ప్రచారం సాగించే వారిని, దుందుడుకు వైఖరులకు ఆజ్యం పోసే మీడియా సంస్థలను కార్పొరేట్‌ సంస్థలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుంటాయి. ప్రమాదకరమైన ప్రచారం చేస్తోందన్న కారణంతో ఫేస్‌బుక్‌ను ప్రసిద్ధ అంతర్జాతీయ కంపెనీలైన ఆదిదాస్‌, డయాజియో, ఫోర్డ్‌, హోండా, హెచ్‌పీ, హర్షేస్‌, కోకాకోలాలు బహిష్కరించాయి. మన దేశంలో పౌర సమాజం నుండి తగినంత ఒత్తిడి లేకపోవడంతో ఇలాంటివి జరగడం లేదు. అయితే కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రం గతంలో దీనిపై ఆందోళనలు వ్యక్తం చేశారు.
మీడియాపై కార్పొరేట్‌ ప్రభావం
వార్తా ఛానల్స్‌పై కార్పొరేట్‌ శక్తుల ప్రభావంతో వాస్తవాలు మరుగునపడుతున్నాయి. వార్తలను నియంత్రించి, తమకు అనుకూలంగా ప్రసారం చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఒక్కో సందర్భంలో తప్పుడు వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, విద్య వంటి ప్రజా ప్రయోజన అంశాలకు పత్రికలు, ఛానల్స్‌లో తగిన ప్రాధాన్యత లభించడం లేదు. రాజకీయ నాయకులు, పార్టీల అధీనంలోని వార్తా ఛానల్స్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సొంత డబ్బా కొట్టుకోవడం తప్పించి వాటిలో మరే ఇతర విషయానికీ ప్రాధాన్యత లభించదు. ఇక సమాజానికి సంబంధించిన అంశాలపై ఏ ఛానల్‌లోనూ చర్చా గోష్టులు నిర్వహించడం లేదు. మరోవైపు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తున్న ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులపై వేధింపులు పెచ్చుమీరిపోతున్నాయి. ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌’ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిర్భయంగా వార్తలు రాసిన 59 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. ఏడుగురు జర్నలిస్టులు కారాగారంలో మగ్గుతున్నారు.
విద్యా సంస్థల్లో సైతం…
ఇక విద్యా సంస్థలలో నెలకొన్న పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. విద్యాలయాలలో హిందూత్వ భావనలు, విద్వేషాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ నేతృత్వంలో పూనేలోని సింబయాసిస్‌ కళాశాలలో జరిగిన నిరసన కారణంగా ఓ అధ్యాపకుడిని యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ కూడా చేశారు. ‘భారత్‌లో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై అశోకా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ప్రచురించిన పరిశోధనా వ్యాసం వివాదానికి దారితీయడంతో ఆయన రాజీనామా చేశారు.
చట్టసభలలో సైతం ప్రజా ప్రయోజనం కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు జరగడం లేదు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తీరును గమనిస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యమైన బిల్లులపై కనీసం చర్చ కూడా జరపకుండానే ఆమోదించిన పరిస్థితిని ప్రజలంతా గమనించారు. పౌర సమాజం సమర్ధవంతంగా పని చేసినప్పుడే ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అయితే పౌర సమాజం అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, దాని గొంతు నొక్కడం, ప్రశ్నించే వారిపై నిర్బంధాలు అమలు చేయడం వంటివి మన దేశంలో నెలకొన్న దుస్థితికి కారణమని చెప్పక తప్పదు.

Spread the love