ఆకలి-అసమానతలకు పరిష్కారమేది?

to hunger-inequities What is the solution?– కీలక అంశాల ప్రస్తావనే లేదు
– జీ-20 డిక్లరేషన్‌పై ప్రశ్నించిన పౌర సమాజం
న్యూఢిల్లీ : జీ-20 సదస్సు ఆమోదించిన డిక్లరేషన్‌లో కీలకమైన అంతర్జాతీయ అంశాల ప్రస్తావన లేకపోవడాన్ని పౌర సమాజ సంస్థలు ప్రశ్నించాయి. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక అసమానతలు, వాతావరణ సంక్షోభం, ఆకలి, ఇంధనం వంటి కీలక సమస్యల పరిష్కారానికి సదస్సు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేకపోయిందని పెదవి విరిచాయి. పౌర సమాజ సంస్థలు, వాటి నేతలతో కూడిన అంతర్జాతీయ సంస్థ ‘పీపుల్స్‌ 20’ ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పౌర సమాజం ప్రాధాన్యత తగ్గిపోవడం, ప్రపంచంలోని పలు దేశాలలో ప్రజాస్వామ్యం బలహీనపడడంపై ఆ ప్రకటన ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, రష్యా, తుర్కియే, మెక్సికో, భారత్‌ సహా పలు జీ-20 దేశాలలో ఈ పరిస్థితి కన్పిస్తోందని తెలిపింది. ‘జీ-20 సదస్సు సందర్భంగా సుందరీకరణ పేరుతో దేశ రాజధానిలోని అనేక మురికివాడలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. దీంతో వేలాది మంది పేదలు నిరాశ్రయులయ్యారు. పౌర సమాజ సంస్థల సమావేశాలను కూడా అడ్డుకున్నారు. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయంతో డిక్లరేషన్‌ను రూపొందించినందుకు భారత ప్రభుత్వానికి అభినందనలు. కానీ, పధ్నాలుగు వేల పదాలకు పైగా ఉన్న ఈ డిక్లరేషన్‌ ప్రపంచ దేశాలను వెంటాడుతున్న సంక్షోభాలపై విశ్లేషణ జరిపి, పరిష్కారాలను సూచించలేకపోయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ సంబంధమైన అసమానతలు, జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న ముప్పు వంటి అంశాలపై డిక్లరేషన్‌ స్పష్టత ఇవ్వలేదు. నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలను, జీడీపీ కేంద్రీకృత అభివృద్ధి నమూనాను అంచనా వేయడంలో సదస్సు విఫలమైంది. ముదురుతున్న అంతర్జాతీయ సంక్షోభాన్ని పట్టించుకోలేదు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ అందులో జరిగిన జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. డిక్లరేషన్‌ అమలు పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దాని అమలు కోసం నిర్దిష్టమైన, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక ఏదీ లేదు. స్వతంత్ర జవాబుదారీతనం కానీ, పర్యవేక్షణ యంత్రాంగం కానీ లేవు’ అని పీపుల్స్‌ 20 సంస్థ ఆ ప్రకటనలో విమర్శించింది.
ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్రపై జీ-20 సదస్సు అనవసరమైన దృష్టి సారించిందని పీపుల్స్‌ 20 సంస్థ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రభుత్వ విధానాల పైన, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల పైన కార్పొరేట్‌ ప్రభావం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. డిక్లరేషన్‌లో పేటెంట్‌ హక్కుల రద్దు, అంతర్జాతీయ పన్ను వ్యవస్థ, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలలో సంస్కరణలు వంటి కీలక అంశాల ప్రస్తావనే లేదని ఎత్తిచూపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన 60 దేశాల రుణాలను రద్దు చేసే విషయంలో చొరవ చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పౌర సమాజ సంస్థల సిఫార్సులకు డిక్లరేషన్‌లో చోటు కల్పించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. వివిధ దేశాలలో పెరుగుతున్న సైనిక వ్యయం, ఆయుధ వ్యాప్తి వంటి అంశాలపై సదస్సు దృష్టి సారించలేదని పీపుల్స్‌ 20 సంస్థ తెలిపింది.

Spread the love