ఎందుకీ ఆర్భాటం?

 Why the fuss?– జీ-20పై నిలదీస్తున్న అంతర్జాతీయ మీడియా
– మోడీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకేనని వ్యాఖ్య
దేశ రాజధానిలో జీ-20 సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. అనేక అంతర్జాతీయ వార్తా సంస్థలు దీనిపై కథనాలు, విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. జీ-20 అధ్యక్ష పదవిని మోడీ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటోందో, వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లకు వల వేసేందుకు ప్రధానికి ఈ వేదిక ఎలా ఉపయోగపడుతుందో విశ్లేషిస్తూ వార్తలు అందిస్తున్నాయి.
సదస్సు ఏర్పాటుకు రూ.4,100 కోట్లకు పైనే..
జీ-20 సదస్సు కోసం ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైనే కేటాయించిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొనగా, నెల రోజుల ముందు నుండే రాజధానిలో కూల్చివేతలు ప్రారంభించి వేలాది మందిని వీధులపాలు చేసిందని సీఎన్‌ఎన్‌ ఓ నివేదికలో వివరించింది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను ‘ఫారిన్‌ అఫైర్స్‌’ మేగజైన్‌ ప్రస్తావించింది. దీనిని అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. దేశంలో మైనారిటీలపై కొనసాగుతున్న వివక్షను ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ఎత్తిచూపింది. ఇప్పటి వరకూ దేశంలో ఇలాంటి అంతర్జాతీయ సమావేశాలు అనేకం జరిగినప్పటికీ సాధించింది శూన్యమని, సమావేశాల చివరలో సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేయలేకపోయారని ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’ వార్తా సంస్థ గుర్తు చేసింది.
న్యూఢిల్లీ : జీ-20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఆయన భద్రతా సలహదారు జేక్‌ సులివాన్‌ పత్రికా గోష్టిని ఏర్పాటు చేశారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు అవరోధాలు, హింసాత్మక ఘటనలు, అరెస్టులు వంటి అంశాలను మోడీతో జరిపే సమావేశంలో బైడెన్‌ ప్రస్తావిస్తారా అని అడిగిన ప్రశ్నకు జేక్‌ సమాధానం దాటవేశారు. కాగా ప్రమాదకరమైన మోడీ మెజారిటీవాదాన్ని పశ్చిమ దేశాలు పట్టించుకోబోవని ‘గార్డియన్‌’ పత్రిక రాసింది. మోడీని, ఆయన రాజకీయ విశ్వాసాలను డొనాల్డ్‌ ట్రంప్‌ (అమెరికా), మారిన్‌ లీ పెన్‌ (ఫ్రాన్స్‌), విక్టర్‌ హార్బన్‌ (హంగరీ)ల ఆలోచనలతో పోల్చింది. మోడీ తన సొంత ప్రతిష్టను ఇనుమడింపజేసు కునేందుకు జీ-20 సదస్సును వాడుకుంటున్నారని, దీనిపై పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వ్యాఖ్యానిం చింది. ‘భారతదేశంలో పేదలు రోడ్ల పైన, అందర్‌పాస్‌లలో తల దాచుకుంటున్నారు. పేవ్‌మెంట్లపై వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుంటాయి. మురికివాడలు, అనుమతి లేని నివాస గృహాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. జీ-20 సదస్సును ఘనంగా నిర్వహించే పేరుతో మూడు లక్షల మంది వీధి వ్యాపారులను ఖాళీ చేయించారు’ అని గార్డియన్‌ పత్రిక తెలిపింది. అధికారులు తమకు అసౌకర్యంగా ఉన్న వాస్తవాలను మరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన విషయమని అని ‘ప్రాజెక్ట్‌ సిండికేట్‌’ రాసింది. భారతదేశంలో మందగిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న అసమానతలు, సన్నగిల్లుతున్న ఉద్యోగావకాశాలు వంటి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని వ్యాఖ్యానించింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయని ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక ఎత్తిచూపిం ది. విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని, పౌష్టికాహార లోపంతో చిన్నారులు అనారోగ్యాలకు లోనవుతున్నారని తెలిపింది.
మీడియా స్వేచ్ఛపై నేడు ఎం-20 సదస్సు
న్యూఢిల్లీ : జీ-20 దేశాలలోని మీడియా సంస్థలు ఒకే రకమైన సమస్యలను, అవరోధాలను ఎదుర్కొంటున్నాయి. అయితే వీటిపై ఆయా దేశాల ప్రభుత్వాలు కనీసం చర్చించేందుకు సైతం సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో శుక్రవారం నాడు మీడియా స్వేచ్ఛపై ఎం-20 సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. మన దేశానికి చెందిన 11 మంది సంపాదకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కూడిన నిర్వాహక కమిటీ ఈ సదస్సును ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన పాత్రికేయులు ఈ సదస్సులో భాగస్వాములవుతారు. ఇప్పటికే మహిళలపై డబ్ల్యూ-20, పౌర సమాజంపై సీ-20, వ్యాపారంపై బీ-20, వాతావరణ మార్పుపై సీ-20 పేరిట సదస్సులు జరుగుతున్నాయి. జీ-20 దేశాధినేతలు మీడియా స్వేచ్ఛపై చర్చించేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వారికి పత్రికా స్వేచ్ఛపై గౌరవం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలోని మీడియా సంస్థల ప్రతినిధులు ఒక్క తాటిపైకి వచ్చి, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సిద్ధపడ్డారు. మన దేశంలో జర్నలిజంను నేరపూరితం చేసే కుట్రలో భాగంగా చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు కాశ్మీర్‌కు చెందిన న్యూస్‌ పోర్టల్‌ ‘కాశ్మీర్‌ వాలా’ సంపాదకుడిని ఒక సంవత్సర కాలం నుండి జైలులో నిర్బంధించారు. ఓ కథనాన్ని రాసినందుకు ‘మారియన్‌ కౌంటీ రికార్డ్‌’ సంస్థపై దాడి చేసి కంప్యూటర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జీ-20 దేశాలలో స్వతంత్ర వార్తా సంస్థల మనుగడ అసాధ్యంగా కన్పిస్తోంది. నిఘా పరికరాల సాయంతో పాత్రికేయుల కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు. అమెరికాలో జూలియన్‌ అసాంజే పైన, ఫిన్లాండ్‌లో హెల్సింగిన్‌ సాలోమట్‌ సంపాదకుడి పైన వేధింపులు మితిమీరాయి. మరోవైపు గూగుల్‌, మేటా, ఎక్స్‌ వంటి బడా సాంకేతిక సంస్థల నుండి పోటీ పెరుగుతోంది. అసత్య వార్తలు, సమాచారం వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్యలన్నింటి పైన ఎం-20 సమావేశంలో చర్చిస్తారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగవుతోందని హిందూ పత్రిక పబ్లిషింగ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌ తెలిపారు. ఐటీ చట్టానికి, డిజిటల్‌ మీడియా మార్గదర్శకాలకు సవరణలు చేయడంతో ఏ వార్తనైనా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు సంక్రమించాయని విమర్శించారు.
బాధాకరం : ఏచూరి
విశ్వవేదికలపై గొప్పలు చెప్పుకునేందుకు దేశం గురించి తప్పుడు సమాచారంతో, గణాంకాలతో మోడీ సర్కార్‌ వండివారుస్తున్న కథనాలు, ప్రచార ఆర్బాటాలు భారత ప్రతిష్టను దిగజార్చుతున్నాయని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకర మని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా ‘నకిలీ అభివృద్ధి’ అంటూ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను ఏచూరి తన పోస్టుకు జత చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు సర్వం దోచిపెడుతూ, సామాన్య ప్రజానీకంపై భారాలు మోపుతున్న నేపథ్యంలో దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను, నిరుద్యోగితను, అంతకంతకూ దిగజారిపోతున్న జిడిపి గణాంకాలను మార్పులు చేసి గొప్పగా చెప్పినంతనే అభివృద్ధి జరిగిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. భారత ప్రతిష్ట పెరగాలంటే కావాల్సింది తప్పుడు లెక్కలు కాదని, సమతుల్య అభివృద్ధి అని ఆయన హితవు పలికారు.

Spread the love