జీ – 20 వెనుక …

Behind the G-20...– పేదల ఇండ్లు, మురికి వాడలు కనబడకుండా పరదాలు
– ఢిల్లీ పేద ప్రజలకు జీ20 ఇక్కట్లు
– గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనలోనూ ఇలాగే
– మాపై ఏమిటీ వివక్ష
– బాధను వ్యక్తం చేస్తున్న స్థానికులు
– ప్రభుత్వం, యంత్రాంగం తీరుపై సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకుల ఆగ్రహం
భారత్‌ 18వ జీ20 శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమైంది. నేడు, రేపు రెండ్రోజుల పాటు జరిగేఈ సమావేశాలకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి సభ్యదేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి(యూఎన్‌), ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి ప్రతినిధులు, జాతీయ, అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు ఇక్కడకు రానున్నారు. దాదాపు ఇప్పటికే పలు దేశాల అధినేతలు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రపంచ మీడియా దృష్టి అంతా జీ20 మీదనే ఉండనున్నది. దీంతో సమావేశం జరగబోయే భారత మండపం నుంచి మీడియా ప్రతినిధులు కూర్చునే గ్యాలరీల వరకూ.. ప్రతిదీ భారత సంస్కృతిని ఉట్టిపడేలా కేంద్రం చర్యలు చేపట్టిందని మోడీ అనుకూల మీడియా, సోషల్‌ మీడియా తీవ్రంగా ప్రచారం చేసుకున్నది.
న్యూఢిల్లీ : ప్రపంచానికి కనబడని తెరవెనుక గాధ ఇంకోటి ఉన్నది. దేశ రాజధానిలోని పేద ప్రజలు నివసించే కాలనీలు, ఇండ్లు, మురికివాడలు కనిపించకుండా పరదా లతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు దేశాధినేతల రాకతో ఇక్కడ ఆంక్షలు విధించటంతో రోజువారీ కూలీలు కొన్ని రోజుల నుంచి ఉపాధిలేక ఆర్థికం కష్టాలను ఎదుర్కొం టున్నారు. అది చాలదన్నట్టు పేదవారిని అంటరాని వారుగా చూస్తూ ఇలా పరదాలు ఏర్పాటు చేయటం అక్కడి స్థానికులను బాధకు గురి చేస్తున్నది. ప్రభుత్వ తీరు తమను కలచివేస్తున్నదని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లోని దాదాపు 200 గృహాల మురికివాడలోని కూలీ క్యాంప్‌లో లాల్‌ తన దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లాల్‌ రోజుకు రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు సంపాదిస్తాడు. అతని కస్టమర్లలో ఎక్కువ మంది ఎదురుగా నెల్సన్‌ మండేలా మార్గ్‌ నుంచి అతని దుకాణానికి చేరుకుంటారు. అయితే గత మూడు, నాలుగు రోజులుగా వినియోగదారులు లేరు. కారణం.. ఆకుపచ్చ వస్త్రంతో పొడవాటి తెరతో మొత్తం కాలనీ బాటసారులు చూడకుండా మూసివేయబడింది. జీ20 సదస్సుకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్స్‌ బోర్డులు తెరపైకి రావటం గమనార్హం. దీంతో తన ఆదాయానికి గండి పడిందని లాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ప్రభుత్వం ప్రజలను ద్వేషిస్తున్నది’
ఇక్కడ ఒక్క లాల్‌ మాత్రమే కాదు.. ఇతనిలాగే వందలాది మంది ఇవే పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. ”కాలనీని దాచడానికి పౌర అధికారులు ఫుట్‌పాత్‌పై స్క్రీన్‌ను ఉంచారు. జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధానిని సందర్శించే ప్రతినిధుల దృష్టికి రాకుండా ఈ ప్రాంతాన్ని పరదాల తో కప్పారు. మమ్మల్ని తెరల వెనక దాస్తు న్నారు” అని స్థానికులు తెలిపారు. ”విదేశీయులు సమీపం లోని హౌటల్‌లో ఉంటారు. వారు ఈ రహదారి గుండా వెళతారు. ఢిల్లీలో మురికివాడలు ఉన్నాయని ప్రభుత్వం వారికి చూపించదలుచు కోవడం లేదు. ప్రభుత్వం పేదలను ద్వేషిస్తున్నట్టు కనిపిస్తున్నది. దీనితో మనది ధనిక దేశమని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నది” అని ఇక్కడి బాధితులు చెప్పారు. వసంత్‌ కుంజ్‌లోని నెల్సన్‌ మండేలా మార్గ్‌లో ఉన్న గ్రాండ్‌ అనే ఫైవ్‌ స్టార్‌ హౌటల్‌ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నదని సమాచారం.
జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు చోట్ల ఇదే తీరు
జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది మాత్రమే కాదు.. జీ20 సమ్మిట్‌ ప్రతినిధులకు పేద ప్రజల ఇండ్లు కనిపించకుండా చేయడానికి పలు ప్రాంతాల్లో అధికారులు తెరలు ఏర్పాటు చేశారు. నోయిడాలో సెక్షన్‌-16 మెట్రో స్టేషన్‌కు సమీపంలో, ఢిల్లీ-నోయిడా-డైరెక్ట్‌ ఫ్లైవేకి ఇరువైపులా ఉన్న పెద్ద టిన్‌ షీట్‌లు దాదాపు 300 పేద కుటుంబాల నివాసమైన జేజే కాలనీని కనిపించకుండా నిరోధిస్తున్నాయి. అధికారులు నెల క్రితమే షీట్లను అమర్చారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ కూడా రోడ్డుకు అభిముఖంగా ఉన్న దుకాణాలు వెళ్లే వారికి కనిపించకుండా చేయడంతో వ్యాపారం తగ్గిపోయిం దని వాసులు వాపోతున్నారు. బైక్‌ రిపేర్‌ షాప్‌లో పనిచేసే వ్యక్తి మాట్లాడు తూ.. ”నాలుగు వారాల క్రితం ఇనుప షీట్లు వేసిన ప్పటి నుంచి దుకాణానికి కస్టమర్లు రావడం లేదు. లేకు ంటే మామూలు రోజుల్లో మాత్రం నా దుకాణం ముందు రిపేరుకు వచ్చే వాహనాలు నిండిపోయేవి” అని తెలిపాడు. నోయిడా అథారిటీ అదనపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రభాష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. టిన్‌ షీట్‌లు సుందరీకరణ పథకంలో భాగమని తెలపటం గమనార్హం.
శ్రామిక తరగతులపై జీ20 భారం
అయితే ఈ భారం ముఖ్యంగా నగరంలోని శ్రామిక తరగతి నివాసితులు, మురికివాడల నివాసులపై పడుతుందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ”మోడీ ప్రభుత్వం ప్రపంచ నాయకులకు రెడ్‌ కార్పెట్‌ వేయాలనుకుంటున్నది. కానీ పేద ప్రజలు దాని భారాన్ని భరించవలసి ఉంటుంది” అని సెంటర్‌ ఫర్‌ హౌలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ అధినేత, కార్మికుల హక్కుల కార్యకర్త సునీల్‌ కుమార్‌ అలెడియా అన్నారు. జీ20 సదస్సు కోసం గత కొన్ని నెలలుగా మురికి వాడల్లో కూల్చివేతులు, పెద్ద ఎత్తున తొలగింపులు జరిగిన ఉదంతాలూ ఉన్నాయన్నారు. దాదాపు 50 వేల మంది ప్రజలు వీటి ద్వారా ప్రభావితమయ్యారని చెప్పారు. ”మొదట, వారి గృహాలు, ఆశ్రయాలను కూల్చి వేశారు. ఇప్పుడు రోజువారీ కూలీ కార్మికులు, విక్రేత లు, వ్యాపారులు బాధలను ఎదుర్కొంటున్నారు” అని అలీడా చెప్పారు.
సామాజిక కార్యకర్తల ఆందోళన
ఢిల్లీలోని ప్రముఖ పౌర సమాజ కార్యకర్త హర్ష్‌ మందర్‌ మాట్లాడుతూ.. గతంలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ వంటి మెగా ఈవెంట్‌ల సమయం లో నగరంలోని పేదలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొ న్నారు. కానీ ఈసారి కూల్చివేతలు విస్తృతం గా జరిగాయి. ఇక్కడ పేదరికం లేదని ప్రపంచానికి తెలియ జేసేందుకు ప్రభుత్వం పేదలను బహిష్కరించాలని లేదా వారిని దాచాలని కోరుకుంటున్నట్టు ఈ విషయాలు చెబుతున్నాయి” అని అన్నారు. జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు, మీడియాతో పాటు యావత్‌ ప్రపంచం ముందు భారత్‌ ఒక ధనిక దేశంగా చూపించుకోవాలనే తాపత్రయం మోడీ సర్కారుకు కనబడుతున్నదని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అమెరికా అధ్యక్షు డిగా డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యా యని అన్నారు. పేద ప్రజల జీవన స్థితిగతులు మారనపుడు ‘తెర వెనుక’ ఆలోచనలే మెదులు తాయనీ, ఇందుకు జాతీయ రాజధాని ప్రాంతంలోని మురికి వాడల్లో నివాసం ఉండే పేద ప్రజలపై ప్రభుత్వం, అధికారుల తీరే నిదర్శనమని వారు తెలిపారు.
ఇప్పటికే పలు ఆంక్షలు
జీ20 నేతల శిఖరాగ్ర సమా వేశానికి రాజధాని సిద్ధమవుతున్న నేపథ్యం లో ఢిల్లీలో పలు కఠినమైన ఆంక్షలు ప్రకటిం చారు.అన్ని పాఠశాలలు,కార్యాలయాలు, కళాశా లలను సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు మూసివే యాలని అక్కడి అధికారులు ఆదేశించారు. సెంట్రల్‌ న్యూ ఢిల్లీ జిల్లాలో, క్లౌడ్‌ కిచెన్‌ లు, అన్ని వాణిజ్య డెలివరీ సేవలు కూడా ఆ రోజుల్లో బంద్‌ కానున్నాయి.

Spread the love