జమిలి ఎన్నికలు ఎందుకో…!?

Why Jamili elections...!?– రాజకీయ లబ్ది కోసమేనంటున్న ప్రపంచ దేశాల అనుభవాలు
న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో చేర్చిన జమిలి ఎన్నికల ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధపడ్డారు. అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ స్థానిక సంస్థలకు, రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిఫార్సులు చేస్తుంది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయంపై కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతి నేతృత్వం వహించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. కోవింద్‌ 1991లో బీజేపీలో చేరారు. పరంఖ్‌లో పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌కు విరాళంగా ఇచ్చారు. ప్రధాని మోడీ అభీష్టం మేరకే రాష్ట్రపతి అయ్యారు. అలాంటి వ్యక్తి ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.
జమిలి ఎన్నికలపై 2015లోనే మోడీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నుండి సిఫార్సులు అందుకున్నారు. అయితే ఆ కమిటీ దేశంలో రెండు దశలుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీనికి ఎన్నికల కమిషన్‌ కూడా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పుడు కేంద్రం మూడు స్థాయిలలోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
రాజకీయ అస్థిరతలతో…
వాస్తవానికి దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అయితే 1971లో ఈ ఆనవాయితీకి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వస్తి పలికారు. పార్టీలో అసంతృప్తులను తటస్థం చేసేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 1989-1996 మధ్యకాలంలో కాంగ్రెస్‌ ప్రాభవం మసకబారింది. ప్రతిపక్షాల కూడా సైద్ధాంతిక విభేదాలతో కలసికట్టుగా వ్యవహరించలేకపోయాయి. 1977-80, 1989-90, 1996-99 కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. 1994-2014 మధ్యకాలంలో రెండు ప్రధాన కూటములు ఏర్పడి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాలుగా దేశాన్ని పాలించాయి. 2014, 2019 ఎన్నికలలో బీజేపీకి, ఎన్డీఏ కూటమికి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించడంతో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన ప్రతిపక్షాల బలం మూడో స్థానానికే పరిమితమైంది.
మరుగున పడిన ప్రతిపాదన
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 1967 ఎన్నికల నుండే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయి. 1971 వరకూ రాష్ట్రాలలో తరచూ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాలుగో లోక్‌సభను కూడా రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. దీంతో జమిలి ఎన్నికల ఆలోచనే మరుగున పడింది. 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 18 రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరిపారు. 1975-76లో లోక్‌సభ పదవీకాలాన్ని సంవత్సరం పాటు పొడిగించడం, 1978లో రాష్ట్రాల శాసనసభలను మొరార్జీ దేశారు రద్దు చేయడం, 1980లో తిరిగి ఇందిరా గాంధీ అధికారంలోకి రావడం వంటి పరిణామాలతో జమిలి ఎన్నికల వ్యవహారం పూర్తిగా వెనక్కి పోయింది. 1989 నుండి దేశంలో ఎన్నికల కోలాహలం బాగా పెరిగిపోయింది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి బలాన్ని పెంచుకున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలలోనూ సత్తా చాటాయి. అంతిమంగా జాతీయ కూటములలో చేరి, ఉనికిని ప్రదర్శించాయి.
దేశంలో ఏదో ఓ ప్రాంతంలో ఎప్పుడూ ఎన్నికలు జరగడం నిత్యకృత్యంగా మారిపోయింది. అది ఓ నిరంతర ప్రక్రియ అయింది. ఈ దశలో లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి సమగ్ర రాజకీయ, సంస్థాగత, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని 1999లో లా కమిషన్‌ తన 170వ నివేదికలో సూచించింది.
ఎందుకీ హడావిడి ?
అయితే ప్రధాని మోడీ, బీజేపీ పార్టీలు ఎందుకింత హడావిడిగా జమిలి ఎన్నికలకు తహతహలాడుతున్నాయి? మన దేశంతో పాటు ఇతర దేశాలలో ఎదురైన కొన్ని అనుభవాలు ఈ ప్రశ్నకు సమాధానాలు అందిస్తాయి. బ్రిటన్‌, బ్రెజిల్‌, అర్జెంటీనా, కెనడా, జర్మనీ, అమెరికా, యూరప్‌ దేశాలలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. 2000వ సంవత్సరంలో ఉక్రెయిన్‌లో మాత్రం పరస్పర విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి.

Spread the love