రాజ్యాంగంలో లేని డిప్యూటీ సీఎంలు

Deputy CMs not in the constitution– 14 రాష్ట్రాల్లో పీఠమెక్కిన 23 మంది
– ప్రభుత్వంలో నేతలు నంబర్‌-2 ఎలా ? : రాజకీయ విశ్లేషకులు
డిప్యూటీ సీఎం… రాజ్యాంగంలో ఈ పదవి గురించిన ప్రస్తావనే లేదు. రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను మాత్రమే కలిగి ఉన్నాయి. అయినా పాలకపార్టీలు ఆయా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల నియామకానికి తహతహలాడుతున్నాయి. రాజకీయాల్లో వ్యక్తులను, వివిధ సామాజిక శక్తులను సంతృప్తి పర్చటానికి ఇలాంటి నియామకాలు చేపడుతున్నాయి. కులాలు, వర్గాల వారీగా ఓట్లు అధికారపార్టీకి దూరం కాకుండా వ్యూహరచన చేస్తున్నాయి. అందుకే ఒకరు లేదా ఇద్దరు అవసరమనుకుంటే ఐదుగురు డిప్యూటీలను నింపేయటానికి కూడా పాలకులు వెనుకాడటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌… ఇప్పుడు ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు ఫార్ములాను బీజేపీ పునరావృతం చేసింది. ఈ మూడు రాష్ట్రాల తర్వాత ఒడిశాకూ ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేవీ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరిదా ఉప ముఖ్యమంత్రులయ్యారు.
గతేడాది మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బీజేపీ రాష్ట్రానికి ఇద్దరు చొప్పున డిప్యూటీ సీఎంలను నియమించింది. నితీశ్‌ కుమార్‌తో కలిసి బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు బీజేపీకి చెందినవారు నియమితులైనారు. మహారాష్ట్రలో కూడా అలాగే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. గతంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
ఏయే రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు?
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మిగిలిన 9 రాష్ట్రాలైన.. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్‌, ఒడిశా, రాజస్థాన్‌ , ఉత్తరప్రదేశ్‌కు ఒక్కొక్కరు లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. బీజేపీ నుంచి 15 మంది, కాంగ్రెస్‌ నుంచి 3, ఇతర పార్టీల నుంచి ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
అసలు డిప్యూటీ సీఎం పదవి ఉందా?
రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్నాయి. ఆర్టికల్‌ 163(1) ప్రకారం గవర్నర్‌కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతత్వంలో మంత్రివర్గం ఉంటుంది.
ముఖ్యమంత్రిని గవర్నర్‌ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్‌ నియమిస్తారనే నిబంధన ఉంది. అయితే ఈ రెండు పేరాల్లో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేదు. డిప్యూటీ సీఎం పదవిని రాష్ట్రంలో క్యాబినెట్‌ మంత్రితో సమానంగా పరిగణిస్తారు. క్యాబినెట్‌ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకూ లభిస్తాయి.
డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధమా?
నిజానికి డిప్యూటీ సీఎంల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రజా రాజకీయ పార్టీ అనే సంస్థ దాఖలు చేసింది. డిప్యూటీ సీఎం నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించాలని డిమాండ్‌ చేసింది.
రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదని పిటిషన్‌లో పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘిస్తుంది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌.. డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి అని, అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని అన్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేదా అధిక జీతం లభించదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి మొదటి, అత్యంత ముఖ్యమైన మంత్రి పదవి అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.
డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చింది?
చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్‌ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా పరిగణించబడతారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1957 జులై వరకు అనుగ్ర నారాయణ్‌ సిన్హా బీహార్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అతని తర్వాత, కర్పూరి ఠాకూర్‌ 1967లో బీహార్‌కి రెండో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 1967 తర్వాత కాంగ్రెస్‌ బలహీనమవడంతో చాలా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు పదవిని చేపట్టారు. 1967లో చౌదరి చరణ్‌ సింగ్‌ నేతత్వంలో ఉత్తరప్రదేశ్‌లో యునైటెడ్‌ లెజిస్లేటివ్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, జనసంఫ్‌ుకు చెందిన రామ్‌ ప్రకాష్‌ గుప్తా డిప్యూటీ సీఎం అయ్యారు. జనసంఫ్‌ు నాయకుడు వీరేంద్ర కుమార్‌ సక్లేచా మధ్యప్రదేశ్‌లో మొదటి డిప్యూటీ సీఎం. 1967లో గోవింద్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, హర్యానా తొలి డిప్యూటీ సీఎం చౌదరి చంద్‌ రామ్‌.
చాలా మంది నేతలు డిప్యూటీ పీఎం కూడా..
డిప్యూటీ సీఎం లాగే, భారతదేశంలోని చాలా మంది నాయకులు డిప్యూటీ పీఎంలుగా కూడా ఉన్నారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ డిప్యూటీ పీఎంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రి. ఆయన తర్వాత మొరార్జీ దేశారు, చరణ్‌ సింగ్‌, దేవి లాల్‌ , లాల్‌ కృష్ణ అద్వానీ కూడా డిప్యూటీ పీఎంలు అయ్యారు. 1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వంలో దేవీలాల్‌ డిప్యూటీ పీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు, రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదనే కారణంతో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, దేవిలాల్‌ నియామకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే..ఆయన ఇతర క్యాబినెట్‌ సభ్యుల మాదిరిగానే మంత్రి అని కూడా తీర్పు చెప్పింది.

Spread the love